ట్వీట్ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
రాబోయే రోజుల్లో హైబ్రిడ్ వాహనాలపై కూడా పన్ను రాయితీపై ఆలోచిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఎక్స్ వేదికగా ఈవీ పాలసీపై ఆయన పోస్టు చేశారు. ఢిల్లీలో ఏర్పడిన వాయు కాలుష్యం వంటి పరిస్థితి హైదరాబాద్, తెలంగాణలో రాకూడదన్న ఉద్ధేశ్యంతో మన రాష్ట్రంలో కొత్త ఈవీ పాలసీ తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
ప్రభుత్వం తెచ్చిన ఈవీ పాలసీ ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా ప్రజలు వాడేలా ఉందన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు. కాలుష్యాన్ని తగ్గించాలంటే ప్రజలు 15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్ చేయించాలన్నారు. కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠినంగా వ్యవహారించాలని రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను మంత్రి ఆదేశించారు.