ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలంటూ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అలాంటి వేళ.. కడపలో జరుగుతోన్న మహానాడు వేదికగా నారా లోకేష్‌కు కీలక పదవి ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ప్రతిపాదించారు. నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని తాము మినీ మహానాడులో తీర్మానించామని సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ధూళిపాళ నరేంద్ర చెప్పారు. పార్టీలని వారంతా కోరుకుంటున్న విధంగా నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు ధూళిపాళ నరేంద్ర విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే మంత్రి నారా లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని తెలుగుదేశం పార్టీలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతుంది. అందులోభాగంగా పార్టీలోని సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితోపాటు పలువురు నేతలు ఇదే విషయాన్ని బుధవారం మహానాడు వేదికగా స్పష్టం చేశారు. ఈ రోజు పార్టీ జాతీయ అధ్యక్ష్యుడిగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. ఆ క్రమంలో నారా లోకేశ్‌ను సైతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే నారా లోకేశ్.. ప్రజా క్షేత్రంలోనే కాదు.. మంత్రిగా కూడా సక్సెస్ అయ్యారని పార్టీ కేడర్ సైతం స్పష్టం చేస్తుంది. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి నారా లోకేశ్ విజయం సాధించారు. అనంతరం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో అత్యంత కీలమైన విద్య, ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదీకాక.. 2023 జనవరి 27వ తేదీన నారా లోకేశ్.. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రజా క్షేత్రంలో లోకేశ్ పరిణితి చెందిన నాయకుడిగా ప్రజల నుంచి మనన్నలు అందుకున్న విషయం విదితమే.