తెలంగాణ కాంగ్రెస్‌కు సమస్యగా మారిన తీన్మార్ మల్లన్న
కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఆ పార్టీతో ఏ మాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న తీన్మార్ మల్లన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యాఖ్యలు చేస్తూ ఆయనను పార్టీలో ఉంచితే కష్టమే అనిపించేలా చేస్తున్నారు. వివిధ వర్గాలపై దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాదు..కొన్ని సభలు ఏర్పాటు చేసుకుని కాబోయే సీఎం అని నినాదాలు కూడా ఇప్పించుకుంటున్నారు. మల్లన్న తీరుతో కాంగ్రెస్ లో అసహనం వ్యక్తమవుతోంది. ఆయనపై త్వరగా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ను ముఖ్య నేతలు వినిపిస్తున్నారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లకు ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. తన ఆస్తి మొత్తం రాసిస్తానని చెప్పి హడావుడి చేసి.. ఆయన ఎలాగోలా ఎన్నికల్లో గట్టెక్కారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడటం ప్రారంభించారు. బీసీ వర్గాల సమావేశాలు పెట్టుకుంటూ కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు. మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టార్గె్ట చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డని మల్లన్న జోస్యం చెప్పారు. వరంగల్ బీసీ సభకు ఆయన హెలికాఫ్టర్ లో హాజరయ్యారు. అక్కడ ఘోరమైన బాషతో విరుచుకుపడ్డారు. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదన్నారు. ఇతర కులాల్ని టార్గెట్ చేసి ఆయన ఘాటు భాషను వాడారు.
ఎమ్మెల్సీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రకటనలు
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే తీన్మార్ మల్లన్న వ్యతిరేకించారు. బీసీ సంఘాల ఓట్లు అడగకుండా నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పే దమ్ము రెడ్లకు ఉందా అని ప్రశ్నించారు. ఆయన తీరు చూసి కాంగ్రెస్ నేతలకే విచిత్రంగా అనిపిస్తోంది. కులగణన రిపోర్టుపై ఘోరమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ శ్రేణుల్ని కూడా అసంతృప్తికి గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ పదవి అందుకున్న తీన్మార్ మల్లన్న ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో మల్లన్న మరింత చెలరేగిపోతున్నారని.. ఇప్పటికైనా ఆయన్ని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.
బీసీల తరపున సీఎం అభ్యర్థి కావాలని లక్ష్యం
తీన్మార్ మల్లన్నకు సీఎం కావాలన్న లక్ష్యం ఉంది. అందుకే తాను బీసీ కావడమే ప్లస్ పాయింట్ గా పెట్టుకున్నారని చెబుతున్నారు. బీసీ సభల్లో అందర్ని రెచ్చగొట్టేలా ..ఇతర కులాల్ని కించ పరిచేలా ఆయన చేస్తున్న వ్యాఖ్యల వెనుక చాలా రాజకీయం ఉందని అంటున్నారు.కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఎన్ని మాటలంటున్నా ఆయనను సస్పెండ్ చేయడమో లేకపోతే అనర్హతా వేటు వేయించడమో చేస్తే మంచిదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ కూడా మల్లన్న వ్యవహారంపై దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు.