Tuesday, October 1, 2024

తెగని ఎపి, తెలంగాణ ఉద్యోగుల పంచాయితీ..?

అటకెక్కిన కమల్‌నాథన్ కమిటీ సూచనలు
జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగులకు అన్యాయం
తెలంగాణలో ఎపి స్థానికత ఉద్యోగులు 1,369 మంది,
ఎపిలో తెలంగాణ స్థానికత ఉద్యోగులు 783 మంది వర్కింగ్
ఉద్యోగుల కేటాయింపును 10 ఏళ్లుగా పట్టించుకోని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు
ఎపి నుంచి తెలంగాణ రావడానికి అర్హత లేని వారు దరఖాస్తు
తెలంగాణ ఉద్యోగ సంఘాల వ్యతిరేకతతో వీడని పీటముడి

ఎపి, తెలంగాణ ఉద్యోగుల పంచాయితీ తేలడం లేదు. 1,369 మంది ఎపి ఉద్యోగులు (తెలంగాణలో పనిచేసే)వారు తమ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోతామంటే వారు తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగులు ఎపికి వెళ్లాలంటే ఎపిలో పనిచేసే తెలంగాణ ఉద్యోగులు సుమారుగా 783 మందిని ఇక్కడకు తీసుకురావాల్సి ఉంది. అయితే ఈ సమస్య ఇరు రాష్ట్రాల సిఎంలు కూర్చొని అంగీకారం తెలపాల్సి ఉండగా సుమారు 11 ఏళ్లు అవుతున్నా అది పెండింగ్‌లో పడడంతో ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎపి, తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2014కు ముందు (ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు) కమల్‌నాథన్ కమిటీ ఉద్యోగులకు సంబంధించి విధి, విధానాలను రూపొందించింది. రాష్ట్ర స్థాయి పోస్టుకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి కమల్‌నాథ్ కమిటీ ఆప్షన్‌లు ఇవ్వాలని సూచించింది. మిగతా ఉద్యోగులైన జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయి ఉద్యోగుల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలని కమల్‌నాథ్ కమిటీ సూచించింది.

ఈ 10 సంవత్సరాల్లో 2,300 మంది ఉద్యోగులు
అయితే కమల్‌నాథన్ కమిటీ సూచనల మేరకు ఈ 10 సంవత్సరాల్లో ఇరు రాష్ట్రాల అంగీకారంతో 2,300 మంది ఉద్యోగుల పంపకం జరిగింది. అయితే 2,300 మందిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్లో పనిచేస్తున్న 1,500 మంది ఉద్యోగులు, క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు 700ల మంది ఉన్నారు. ఇదిలా ఉండగా అయితే ఎపి, తెలంగాణ స్థానికత కలిగి జిల్లా, జోనల్, మల్టీజోనల్ స్థాయి పోస్టులో కొనసాగుతున్న ఉద్యోగుల విషయంలో మాత్రం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు తమను కూడా తమ రాష్ట్రాలకు పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో చంద్రబాబునాయుడు, జగన్, కెసిఆర్‌లు సిఎంలు ఉన్నప్పుడు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. జగన్, కెసిఆర్‌లు సిఎంగా ఉన్నప్పుడు మూడేళ్ల క్రితం ఇరు రాష్ట్రాల సిఎంల ఆదేశంతో ఇరు రాష్ట్రాల సిఎస్‌లు ఈ అంశంపై లేఖలు సైతం రాసుకున్నారు.

మూడేళ్ల క్రితం ఎపికి పంపించడానికి లేఖ రాసిన తెలంగాణ
అయితే తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల క్రితం దీనికి సంబంధించి 1896 సర్యులర్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని అప్పటి ఎపి ప్రభుత్వ సిఎస్‌కు తెలియచేస్తూ ఒక లేఖ రాసింది. తెలంగాణలో ఎపి స్థానికతతో పనిచేస్తున్న వారి వివరాలను తెలియచేస్తూ వారిని ఎపికి పంపించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో ఎపి స్థానికతతో పనిచేస్తున్న 1369 మంది ఉద్యోగుల్లో టీచర్లు 600ల మంది, పోలీసులు 600ల మంది, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వారు 64 మంది, ఐసిడిఎఫ్‌లో పనిచేసే వారు 20 మంది, మోడల్ స్కూల్‌లో పనిచేసే వారు 15 మంది, ట్రైబుల్ వెల్ఫేర్‌కు సంబంధించిన ఉద్యోగులు 10 మంది, టెక్నికల్ ఎంపవర్‌మెంట్ శాఖలో పనిచేసే వారు 05 మంది, అగ్రికల్చర్‌లో 15 మంది, రెవెన్యూలో 03, యూనివర్శిటీ లెక్చరర్‌లు, 15 మంది, ఆర్ అండ్ బిలో 10 మంది పనిచేస్తున్నారు.

ఎపిలో పనిచేస్తున్న తెలంగాణ వారు 783 మందే….!
అయితే తెలంగాణ రాసిన లేఖను అందుకున్న ఎపి ప్రభుత్వం ఎపిలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉద్యోగులు పంపిస్తామని పేర్కొంది. అయితే తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులు ఎపిలో సుమారుగా 783 ఉండగా వీరికి తోడు మరో 1,097 మంది ఉద్యోగులు కూడా తెలంగాణ రావడానికి సిద్ధంగా ఉన్నారని వారిని కూడా తెలంగాణకు పంపుతామని ఎపి ప్రభుత్వం 15128 సర్కులర్‌ను జారీ చేయడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో తెలంగాణకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు దానిని వ్యతిరేకించారు. తాము తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులను మాత్రమే రాష్ట్రానికి రావడానికి సమ్మతిస్తామని వారు అప్పటి ప్రభుత్వంతో తెగేసి చెప్పారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కనబెట్టింది. మూడేళ్ల క్రితం నుంచి ఇప్పటివరకు దీని గురించి పట్టించుకోకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సిఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబులను కలిసినా….
ఇరు రాష్ట్రాల ఉద్యోగులు మాత్రం తమను తమ రాష్ట్రాలకు కేటాయించాలని ప్రస్తుతం సిఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడులను సైతం కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వారు వాపోతున్నారు. దీనివల్ల తమకు రిజర్వేషన్‌లు వర్తించడం లేదని, తల్లిదండ్రులకు హెల్త్‌కార్డు పనిచేయడం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించడం లేదని వారు వాపోతున్నారు. దీంతోపాటు ఇరు రాష్ట్రాల్లో తాము కలవని నాయకులు లేరని ఎవరూ తమపై దయచూపడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular