రేపు ఉదయం కేబినెట్ భేటీ.. బడ్జెట్‌కు ఆమోదం
రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌కు సమయం ఆసన్నమైంది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలు సహా అన్ని పథకాలను పరిగణనలోకి తీసుకుని రూ.2.90లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు బడ్జెట్‌ను రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల కోసం ప్రవేశపెట్టిన ‘ఓట్-ఆన్-అకౌంట్’ బడ్జెట్ గడువు ఈ నెల 31తో ముగియనుండడంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది.
ఈ మేరకు శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షించారు. ఆయా శాఖలు తమ ప్రాధమ్యాలను వివరించగా.. ప్రభుత్వం కూడా బడ్జెట్‌పై ఒక అంచనాకు వచ్చింది. దీనితో పాటుగా ఈ నెల 22న ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి.. శాఖలు, పథకాల వారీగా కేటాయించిన పద్దులను పరిశీలించి ఓకే చెప్పారు. నేడు ఉదయం క్యాబినెట్ సమావేశంలో 2024–-25 పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు.
గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్-లో మంత్రి మండలి సమావేశమవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది.
సర్దుబాటు
కేంద్రం నుంచి పెద్దగా నిధులు వచ్చే పరిస్థితులేమీ లేకపోవడంతో.. బడ్జెట్‌ను ఉన్నంతలో సర్దుబాటు చేశారు. దాదాపుగా కొన్ని పథకాలకు కోత పెట్టనున్నారు. కేంద్రం నుంచి రెగ్యులర్‌గా వచ్చే ట్యాక్స్‌లు మినహా.. ప్రత్యేక నిధులు ఏం లేవని స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర బడ్జెట్‌ను ముందుగానే ఊహించి సిద్ధం చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. నిజానికి, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చే కేంద్ర గ్రాంట్లు, కేంద్ర సౌజన్య పథకాలు , పన్నుల్లో వాటాలకు సంబంధించిన నిధులను పరిశీలించిన తర్వాత.. స్వల్ప మార్పులతో రాష్ట్ర బడ్జెట్‌కు తుదిరూపు కోసం ప్రభుత్వం ఎదురుచూసింది. కానీ, కేంద్రం నుంచి స్పెషల్ ఫండ్స్ లేకపోవడంతో.. ఉన్నంతలోనే సర్దుబాటు చేసుకున్నది.
2023– -24 ఆర్థిక సంవత్సరానికి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.2,90,396కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు చేసింది. వాస్తవ రాబడులను పరిగణనలోకి తీసుకోకుండా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిందని ఆరోపించింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. వాస్తవ రాబడులను పరిగణలోకి తీసుకుని రూ.2,75,891 కోట్లతో ‘ఓట్-ఆన్-అకౌంట్’ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమలు చేస్తున్న గ్యారెంటీలు, రుణ మాఫీ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను మళ్లీ రూ.2.90 లక్షల కోట్ల వరకు పెంచనుందని తెలిసింది.
వ్యవసాయ శాఖదే భారీ పద్దు
ఈ సారి బడ్జెట్‌లోనూ వ్యవసాయ శాఖకే భారీ కేటాయింపులు చేయనున్నారు. ముఖ్యంగా రుణమాఫీకి రూ.31వేల కోట్లు, రైతు భరోసాకు రూ.15వేల కోట్లు, రైతు బీమాకు మరో రూ.7వేల కోట్ల వరకు అవసరమవుతాయన్న అంచనాలున్నాయి. వీటిలో ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. మరోవైపు.. పాత బకాయిల చెల్లింపు, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులకు నిధుల ఆవశ్యకత దృష్ట్యా సాగునీటి పారుదల శాఖ ఈసారి రూ.19వేల కోట్ల వరకు ప్రతిపాదనలను సమర్పించింది.
ఇందులో రూ.11వేల కోట్ల వరకు కేటాయించే అవకాశాలున్నాయి. ఆరు గ్యారెంటీల్లోని రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చింది. వీటికి ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు చేయనుంది. కేంద్ర బడ్జెట్‌లో పీఎంఆవాస్ యోజన కింద రాష్ట్రానికి వచ్చే నిధులను పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులను ఖరారు చేయనుంది. అయితే.. మహిళలకు నెలకు రూ.2,500 భృతి, నిరుద్యోగ భృతి వంటి పథకాలకు ఈ బడ్జెట్‌లో చోటు కల్పిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.