Monday, April 7, 2025

ఈ బడ్జెట్ అంచనాల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక నిధులు

రూ.72,659 కోట్లు కేటాయింపుతో రైతన్నల సంతోషం
రూ. 2,91,159 కోట్లతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను
ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ బడ్జెట్ అంచనాల్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 2024, 25 సంవత్సరానికి సంబంధించి రూ. 2,91,159 కోట్లతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా వ్యవసాయరంగానికి అత్యధికంగా సుమారుగా 25 శాతం అధికంగా నిధులను కేటాయించింది. మొత్తంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించినట్టు భట్టి ప్రకటించారు. రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం ఒకేసారి రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించిందని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద రూ.80,440 కోట్లను ఖర్చు చేసిందని, తమ ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా, రైతుబంధు పథకం స్థానంలో రైతు భరోసాను తీసుకువచ్చిందని భట్టి తెలిపారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి రూ.15,000లు చెల్లించాలని నిర్ణయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ దాశరథి కవితతో ప్రసంగం ప్రారంభం
అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను గురువారం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి కవితతో భట్టి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చామన్నారు. రుణమాఫీ, రైతుభరోసా, రైతు కూలీలకు ఆర్థికసాయం అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఏయే రంగానికి ఎంత కేటాయించారో ఆయన వివరించారు.

రైతు కూలీలకు ఆర్థిక సాయం
భూమిలేని రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12,000లు అందించనున్నట్లు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంట బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. సన్నరకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి, వాటిని పండించిన రైతుకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

లక్ష ఎకరాల ఆయిల్ పాంను సాగు చేసేలా….
తెలంగాణలో 12.12 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు ద్వారా 53.06 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, 2024,-25 లో రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాల ఆయిల్ పాంను సాగు చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పటికే 77,857 ఎకరాలకు రిజిస్ట్రేషన్ జరగ్గా, 23,131 ఎకరాలకి అనుమతులు కూడా ఇవ్వడం జరిగిందని ఆయన ప్రకటించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని, రైతులకు ఎలాంటి సమస్య రాకుండే ఉండేందుకు నాణ్యమైన విత్తనాలు రైతులకు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.

తుదిదశలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట
సాగునీటి రంగంలో తుదిదశలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయకట్టు పెంచే 18 ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో సాగునీటి రంగానికి ఏకంగా రూ.22,301 కోట్లను కేటాయించినట్టు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టిందని, ఎన్డీఎస్‌ఏ సూచనల ఆధారంగా ప్రాజెక్టును కాపాడుకుంటామని ఆయన ప్రకటించారు. నీటి పారుదల శాఖకు ఈ బడ్జెట్‌లో 22వేల 301 కోట్ల రూపాయలను కేటాయించినట్టు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 73 ప్రాజెక్టులు చేపడితే 42 ప్రాజెక్టులు పూర్తికాగా, మరో 31 ప్రాజెక్టులు నిర్మాణదశలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రాజెక్టులను ఈ ఏడాది, 12 ప్రాజెక్టులను వచ్చే ఏడాది పూర్తి చేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. దీంతోపాటు ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన పేర్కొ న్నారు. గత ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి నిపుణుల సూచనలకు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రాజెక్టుపై విచారణ కమిటీని నియమించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయన్నారు.

కుట్రపూరితంగానే ధరణి పోర్టల్ అమల్లోకి…
గత ప్రభుత్వం కుట్రపూరితంగానే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. చాలా సంవత్సరాలుగా భూమిపై సర్వ హక్కులు ఉండి, అనుభవిస్తోన్న కొందరు రైతులకు వారి భూమి వారికి కాకుండా గత ప్రభుత్వం ఈ ధరణిని తీసుకొచ్చిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూములను ధరణి పోర్టల్ లో నమోదు చేసే సమయంలో చోటు చేసుకున్న లోపాలు, అక్రమాలు, అవకతవకల వల్ల లక్షలాది రైతులు మనోవేదనకు గురయ్యారన్నారు. ఈ పొరపాట్లను సరిదిద్దేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతో మంది వారి భూములను అమ్ముకోలేకపోయారన్నారు. పెళ్లిళ్లకు, పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి నానా అగచాట్లు పడ్డారన్నారు. లోపభూయిష్టమైన ధరణి నిర్వహణ వల్ల చాలా మంది రైతులు రైతుబంధు, రైతుబీమా వంటి ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారని, ఇదే విషయాన్ని హైకోర్టు ధరణి పోర్టల్‌లోని ఎన్నో లోపాలను ఎత్తి చూపించిందన్నారు.

కమిటీ నివేదిక ప్రకారమే
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం జనవరిలోనే ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి కమిటీని నియమించింది. ధరణి సమస్యలపై కమిటీ అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా కృషి చూపిస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆ కమిటీ సూచనల మేరకు మొదటి దశలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించడానికి స్పెషల్ డ్రైవ్ ని చేపట్టినట్లు భట్టి వివరించారు. మార్చి ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.

మార్చి ఒకటో తేదీ నాటికి 2,26,740 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా 1,22,774 కొత్త దరఖాస్తులు వచ్చాయని, మొత్తంగా 3,49,514 దరఖాస్తుల్లో 1,79,143 దరఖాస్తులను పరిష్కరించినట్లు ఆయన చెప్పారు. ధరణి పోర్టల్‌లో 35 లావాదేవీలకు సంబంధించిన మాడ్యూళ్లను 10 సమాచార మాడ్యూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ మాడ్యూళ్ల వల్ల క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులకు కొంత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రభుత్వం ధరణి సమస్యల పరిష్కారాల పురోగతిని ఎప్పటికప్పుడు కలెక్టర్లతో సమీక్షిస్తుందని, ధరణి కమిటీ పూర్తి అధ్యయనం తర్వాత శాశ్వత పరిష్కారం దిశగా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరమన్నారు. ఇప్పటికే ఈ నగరం ఒక ఐకాన్‌గా గుర్తింపు పొందిందని, ఈ నేపథ్యంలోనే ఈ బడ్టెట్‌లో హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇందులో మెట్రో వాటర్ వర్క్, ఔటర్ రింగ్, మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన వంటివి ఉన్నాయని ఆయన తెలిపారు. అంతే కాకుండా జీహెచ్‌ఎంసీలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా రూ.3,065 కోట్లు, హెచ్‌ఎండిలో మౌలిక వసతులకు మరో రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

ప్రపంచ స్థాయిలో హైదారాబాద్ నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ నిధులను పూర్తి స్థాయిలో ఆయా సంస్థల అభివృద్ధి కోసమే వాడతామని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం హైదరాబాద్ నగర సుందరీకరణకు, మౌలిక వసతుల రూపకల్పనకు పూర్తి స్థాయిలో కృషి చేస్తాని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో బ్రాండ్ హైదరాబాద్ పేరును నిలబెడతామని ప్రపంచం లోనే బెస్ట్ సిటీగా హైదరాబాద్‌ను నిలుపుతామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత పదేళ్లలో అస్తవ్యస్త పాలన సాగిందని ఆయన ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందని ఆయన ఆరోపించారు.

హోం శాఖకు రూ. 9,564 కోట్లు
హోం శాఖకు రూ. 9,564 కోట్లు కేటాయించినట్టు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ విభాగానికి, టిజి న్యాబ్ బలోపేతానికి అధిక నిధులు కేటాయించినట్టు ఆయన తెలిపారు. సైబర్ సెక్యూరిటీకి గతేడాది రూ.9 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.15 కోట్లను కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాల కట్టడికి సాంకేతికత, కొనుగోలు, నిర్వహణకు అధిక ప్రాధాన్యమిచ్చినట్టుగా భట్టి తెలిపారు. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు గతేడాది రూ.8.50 కోట్లు కేటాయించగా ఈ ఏడాది రూ.20 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు. డిజిపి, ఐజీ శాఖాధిపతులకు రూ.374.48 కోట్లు కేటాయించామని, గతేడాది కంటే ఈ ఏడాది రూ. 100 కోట్లు తగ్గించినట్టు ఆయన పేర్కొన్నారు. కీలకమైన హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ విభాగానికి అత్యధికంగా రూ. 276.44 కోట్లను ప్రభుత్వం కేటాయించగా, నగరంలో మరో కీలకమై కమిషనరేట్ సైబరాబాద్‌కు రూ.20 కోట్లు, రాచకొండ కమిషనరేట్‌కు రూ.9.40 కోట్లు కేటాయించినట్టు ఆయన తెలిపారు

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అప్పు పదిరెట్లు పెరిగింది
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అప్పు పదిరెట్లు పెరిగిందని డిప్యూటీ సిఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ అప్పులు రూ.6,71,757 కోట్లు కాగా, రాష్ట్ర ఆవిర్భావ సమయానికి రూ.75,577 కోట్ల అప్పు ఉందని, 2023 డిసెంబర్ నాటికి రూ.6,71,757 కోట్లుకు చేరిందని ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత పది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు దాదాపు పది రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత రూ.35,118 కోట్ల రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాల్లో అసలు, వడ్డీలతో కలిపి రూ.42,892 కోట్ల బకాయిలను చెల్లించినట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు రూ.34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశామన్నారు. గతంలో తలసరి ఆదాయానికి సంబంధించి జిల్లాల మధ్య వ్యత్యాసం ఉందన్నారు. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ.9,46,862 కాగా, వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ.1,80,241లు ఉందన్నారు. దీంతో రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలను తగ్గించడానికి తమ ప్రభుత్వం పలు విధానాలను రూపొందించి అమలు చేస్తున్నామని భట్టి చెప్పారు.

విద్యుత్ రంగానికి ప్రభుత్వం రూ.16,410 కోట్లు
రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానాన్ని తీసుకొచ్చి, సౌరశక్తి రంగానికి ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ రంగానికి ప్రభుత్వం రూ.16,410 కోట్లను కేటాయించినట్టు ఆయన తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాలో నష్టాలు తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు. 2030 నాటికి అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యుత్ వాహనాలు ప్రోత్సహిస్తూ, ఇప్పుడున్న 450 విద్యుత్ వాహనాల చార్జీంగ్ స్టేషన్లకు తోడు మరో 100 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు ఆయన తెలిపారు. ప్రజలకు చార్జీంగ్ సౌకర్యాలు అందుబాటులోనికి తెచ్చేందుకు టిజి ఈవీ మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన ఎనర్జీ పాలసీని తెస్తామని, ఇందులో సౌరశక్తి రంగానికి ప్రాధాన్యతనిస్తామన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు..
గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో పేద ప్రజలను మోసం చేసిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పూటగడవని నిరుపేదలకు గూడు సమకూర్చడం ప్రభుత్వ కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిరుపేదలకు ఎన్నో ఆశలు కల్పించి ఇళ్లు కేటాయించకుండా దగా చేసిందన్నారు. పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించామన్నారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకోవడానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.6లక్షల సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 2024-,25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్రంలో 4లక్షల 50 వేల గృహాల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com