Friday, April 4, 2025

సైబర్ నేరాలు ద్వారా పోగొట్టుకున్న రూ.85.05 కోట్ల భారీ సొమ్ము రిఫండ్

రూ.85.05 కోట్ల భారీ సొమ్మును బాధితులకు రిఫండ్ చేపించిన టిజిసిఎస్‌బి
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు మరియు జిల్లాలలో మార్చి నుండి జులై 2024 వరకు సైబర్ మోసాలకు గురైన బాధితులకు రూ.85. 05 కోట్లు రీఫండ్ చేయడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్‌బి) సహకరించడం ద్వారా కొత్త ప్రమాణాలు నెలకొల్పింది. టిజిసిఎస్‌బి మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టిజిఎల్‌ఎస్‌ఎ) మధ్య జరిగిన సంయుక్త కృషి ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. పౌరులకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగించే సైబర్ నేరాల నేపథ్యంలో నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సిఆర్‌పి) ద్వారా స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రయత్నాలు జరిగాయి.

బ్యాంకుల్లో మోసపూరిత నిధులు ఎక్కువ కాలం పాటు నిలిచి ఉండటం, బాధితులకు తిరిగి చెల్లించకపోవడం అనేది ప్రధాన సమస్య. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఫిబ్రవరి 2024లో, టిజిసిఎస్‌బి టిజిఎల్‌ఎస్‌ఎ సహకారంతో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 457 కింద పిటిషన్లు దాఖలు చేసే విధానాన్ని క్రమబద్ధీకరించడానికి ఎస్‌ఓపి రూపొందించి, తెలంగాణలోని అన్ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలకు టిజిసిఎస్‌బి ద్వారా పంపారు.

రిఫండ్ యొక్క ఫలితాలు
ఈ చర్యలు అమలుకై ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి అన్ని జిల్లా న్యాయమూర్తులకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటి నుండి మొత్తం 6,840 పిటిషన్లు న్యాయస్థానాల్లో దాఖలు చేయబడ్డాయి. రూ.85.05 కోట్ల మొత్తానికి 6,449 కేసులకు రీఫండ్ ఆదేశాలు మంజూరు చేశారు. ఈ మొత్తంలో, రూ.36.8 కోట్లు సైబరాబాద్ కమిషనరేట్‌లో రీఫండ్ చేశారు, ఇది అత్యధిక రీఫండ్లను ప్రాసెస్ చేసిన యూనిట్‌గా నిలిచింది. ఈ కార్యక్రమం సైబర్ మోసం బాధితులకు తక్షణ ఆర్థిక ఉపశమనం అందించింది.

తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ, చట్టపరమైన చర్యలకు కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది. టిజిసిఎస్‌బి, టిజిఎల్‌ఎస్‌ఎ మధ్య సహకారం, తెలంగాణ హైకోర్టు యొక్క క్రియాశీల భాగస్వామ్యంతో పాటు, పౌరులపై సైబర్ నేరాల యొక్క ఆర్థిక పరిణామాలను ఎదుర్కోవడానికి రూపొందించబడిన బలమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను నొక్కి చెబుతుంది. ఈ ప్రయత్నాలు సైబర్ ముప్పుల నుండి తెలంగాణ పౌరులను రక్షించడానికి, బాధితులకు న్యాయం, ఆర్థిక పరిహారం అందించడానికి టిజిసిఎస్‌బి నిరంతర అంకిత భావాన్ని ప్రదర్శిస్తాయి.

గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత
సైబర్ మోసాన్ని గుర్తించిన వెంటనే లేదా అనుమానించిన వెంటనే ‘గోల్డెన్ అవర్‘ లో సైబర్ మోసాన్ని నివేదించడం చాలా ముఖ్యమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో నొక్కి చెబుతుంది. వెంటనే నివేదించడం వల్ల నిందితుడి బ్యాంకు ఖాతాలు, డిజిటల్ వాలెట్లలో కాజేసిన సొమ్ము మొత్తాన్ని స్తంభింపజేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, తద్వారా బాధితులకు రీఫండ్లను సులభతరం చేస్తుంది. బాధితులు 1930 కి కాల్ చేయడం ద్వారా లేదా cybercrime.gov.in పోర్టల్‌ను సందర్శించడం ద్వారా వెంటనే సంఘటనలను నివేదించాలని కోరారు.

ప్రాథమిక నివారణ చర్యలు
అపరిచితులు/సంస్థలతో ఆన్‌లైన్‌లో వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకోవద్దు.
ఆర్థిక లావాదేవీలను కోరిన మెసేజ్ లు లేదా ఇమెయిళ్ల యొక్క ప్రామాణికతను నిర్ధారించుకోండి.
విభిన్న ఖాతాలకు బలమైన, ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి, వాటిని తరచుగా మార్చండి.
దుష్పరిమాణాల నుండి రక్షించుకోవడానికి మీ సాఫ్ట్‌వేర్ మరియు భద్రతా వ్యవస్థలను అప్డేట్ చేసుకోవాలి.
ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు లేదా సైబర్ నేరాన్ని వెంటనే టీజీసీఎస్బీకి నివేదించండి.
స్టాక్ పెట్టుబడి ఎల్లప్పుడూ డీమ్యాట్ ఖాతా, స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా మాత్రమే జరుగుతుంది, ఏదైనా కంపెనీ వెబ్‌సైట్ల ద్వారా కాదు.

ఏ చట్టబద్ధమైన సంస్థలు ఎప్పుడూ కూడా వీడియో కాల్‌లు చేసి ధ్రువీకరణ కోసం ఏదైనా ఖాతాకు డబ్బు బదిలీ చేయమని అడగవు. ఈ నివారణ చర్యలు, తక్షణ నివేదనల ద్వారా, తెలంగాణ పౌరులు సైబర్ మోసానికి గురికాకుండా తమను తాము రక్షించుకోవచ్చు, అధికారు లు త్వరతగతిన చర్యలు తీసుకోవడానికి సహాయపడతారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com