Wednesday, November 20, 2024

వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడిన, ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవాలి

గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ
లగచర్లలో వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడికి పాల్పడిన వారిపై, ప్రేరేపించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మకు తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ వినతిపత్రం అందించారు. జేఏసి చైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో మంగళవారం జేఏసి నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. లగచర్ల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను గవర్నర్‌కు లచ్చిరెడ్డి వివరించారు. రైతుల మాటున కొందరు దుండగులు అధికారులపై దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని గవర్నర్ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోకపోతే, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన ఉద్యోగుల్లో నెలకొందని ఆయన పేర్కొన్నారు.

రైతుల మాటున అధికారులపై దాడికి పాల్పడ్డ దుండగులపై, దాడికి ప్రేరేపించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్‌ను ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల భద్రత కోసం, వారు సురక్షిత వాతావరణంలో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులు కల్పించేలా సంబంధిత అధికార వర్గాలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన విన్నవించారు. జేఏసి నాయకులు విన్నవించిన ప్రతి అంశాన్ని సావధానంగా గవర్నర్ వినడంతో పాటు తదుపరి చర్యలకు సంబంధించిన అంశాలపై సానుకూలంగా స్పందించారు. అధికారులపై దాడులు చేసిన నిందితులను, దాడికి ప్రేరేపించిన కుట్రదారులపై కఠినచర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసి నాయకులు డా. నిర్మల, జిఎస్ కుమారస్వామి, కె. రామకృష్ణ, ఎస్.రాములు, రమేష్ పాక, మేడి రమేష్, దర్శన్ గౌడ్, ఫూల్ సింగ్ చౌహాన్, మహిపాల్ రెడ్డి, అంజయ్య, రాబర్ట్ బ్రూస్ పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular