Thursday, October 3, 2024

ఎక్సైజ్ శాఖలో దసరాకైనా బదిలీలు, పదోన్నతులు జరిగేనా..?

  • కొత్తగా 16 పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటుపై వీడని పీఠముడి…!
  • పదోన్నతులు, బదిలీలు లేక 2,700ల మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఇబ్బందులు
  • సమ్మె చేసే యోచనలో కానిస్టేబుళ్లు
  • రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆదేశించినా కిందిస్థాయి నుంచి పైస్థాయి కేడర్ వరకు
    సాధారణ బదిలీలను చేపట్టని ఎక్సైజ్ శాఖ
  • పదోన్నతులను కల్పించడంలోనూ అధికారుల నిర్లక్షం

ఎక్సైజ్ శాఖలో పదోన్నతులు, బదిలీలు లేకపోవడంతో పాటు కొత్త పోలీస్‌స్టేషన్ ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో ఆ శాఖ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. 8 సంవత్సరాలుగా సుమారుగా 2,700ల మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు, బదిలీలు లేకపోవడం, మరో 200ల మంది కానిస్టేబుళ్లను అప్‌గ్రేడేషన్ చేయకపోవడంతో తమ సమస్యను ఎవరికీ చెప్పుకోవాలో తెలియక వారు సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారంతా జేఏసిగా ఏర్పడి సమ్మె చేసే యోచనలో ఉన్నట్టుగా తెలిసింది. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వానికి తాము చాలాసార్లు తమ పదోన్నతులు, బదిలీల గురించి వినతులు ఇచ్చామని అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. దీంతోపాటు పార్లమెంట్ ఎన్నికలకు ముందు సుమారుగా 200ల మంది ఉద్యోగులు, అధికారులు బదిలీలయినా వారిని తిరిగి తమ తమ స్థానాలను తీసుకురావడంలో అధికారులు పట్టించుకోవడం లేదని ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ అయినా తమ బాధను అర్ధం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ ఉన్నా న్యాయం జరగడం లేదు
వీటితో పాటు మూడు సంవత్సరాల క్రితం కొత్తగా 16 ఎక్సైజ్ స్టేషన్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినా ఇప్పటివరకు వాటిని ఏర్పాటు చేయకపోవడంతో మిగతా స్టేషన్‌లలో పనిచేస్తున్న పోలీసులు, సిబ్బంది పనిఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద సుమారుగా 85 మంది అధికారులు వివిధ హోదాల్లో పదోన్నతులు పొంది మూడేళ్లుగా బాధ్యతలను నిర్వహిస్తున్నా ఇంతవరకు కొత్త పోలీస్‌స్టేషన్‌లను ఏర్పాటు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోసారి ఈ అధికారులు పదోన్నతుల కోసం సిద్ధంగా ఉన్నారని అయినా కొత్త పోలీస్‌స్టేషన్‌ల ఏర్పాటులో నిర్లక్షం వహిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ పోలీస్‌స్టేషన్‌లకు సంబంధించి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినా ఇప్పటివరకు వాటిని ఏర్పాటు చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం సాధారణ బదిలీలు చేయాలని జిఓ 80 కింద ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఈ శాఖలో బదిలీలు జరగ లేదు. ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆ శాఖ ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, ఉద్యోగులు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పఠాన్‌చెరు స్థానంలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్
ఆబ్కారీ శాఖ నుంచి ప్రతి సంవత్సరం సుమారుగా రూ.35 వేల కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా 40 ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలతో పాటు 139 ఆబ్కారీ పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ముఖ్యంగా 16 కొత్త స్టేషన్లు ఏర్పాటయితే అక్రమ మద్యం, గంజాయి, గుడుంబాలపై ఉక్కుపాదం మోపవచ్చని, మరింత సమర్ధవంతగా విధులు నిర్వహిస్తామని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. గ్రేటర్ పరిధిలో కొత్తగా ఏర్పాటయ్యే 14 పోలీస్టేషన్‌లలో శంషాబాద్, సరూర్‌నగర్, హయాత్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్, మల్కాజిగిరి, అమీర్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్, మలక్‌పేట్, కుత్బుల్లాపూర్, లింగపల్లి స్టేషన్లు ఉన్నాయి. దీంతోపాటు పఠాన్‌చెరు స్థానంలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ ఏర్పాటు చేయనుండగా వీటితో పాటు సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లను విభజించనున్నారు. అదేవిధంగా హన్మకొండ జిల్లాలోని హన్మకొండలో మరో స్టేషన్ కొత్తగా రానుంది.

నవంబర్ లేదా డిసెంబర్‌లోగా బదిలీలు, పదోన్నతులు
ఆగష్టు 31వ తేదీ నాటికి గుడుంబాను పూర్తిగా నిర్మూలించడానికి ఎక్సైజ్ శాఖ డ్రైవ్ చేపట్టిందని, అందులో భాగంగా బదిలీలను సెప్టెంబర్‌లోగా చేపడుతామని ఆ శాఖ అధికారులు పేర్కొన్నా అక్టోబర్ నెల వచ్చినా ఇప్పటివరకు బదిలీలు, పదోన్నతులు చేపట్టడం లేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2007 జిఓ 143 ప్రకారం కొన్ని ప్రత్యేక డిపార్ట్‌మెంట్‌లకు (స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖలకు, కమర్షియల్ ట్యాక్స్, రవాణా) శాఖ ఉద్యోగులను పరిపాలన అనుమతుల కింద ఎప్పుడైనా బదిలీ చేయవచ్చన్న రూల్స్ ఉన్నా దాని గురించి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం కొత్త పోలీస్‌స్టేషన్‌లతో పాటు బదిలీలు, పదోన్నతులు నవంబర్ లేదా డిసెంబర్‌లోగా జరిగే అవకాశం ఉందని పేర్కొనడం విశేషం.

ఎక్సైజ్ చెక్‌పోస్టుల వద్ద కనీస వసతులు కరువు
దీంతోపాటు ఎక్సైజ్ చెక్‌పోస్టుల్లో కనీస వసతులను ఉన్నతాధికారులు కల్పించడం లేదని టాయిలెట్‌లు సైతం లేవని అక్కడ పనిచేసే వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 18 ఎక్సైజ్ చెక్‌పోస్టులు ఉండగా నారాయణపేటలో (కృష్ణా చెక్‌పోస్టు) వద్ద మాత్రమే అధికారులు కూర్చోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఒక కంటెయినర్‌ను ఏర్పాటు చేశారని మిగతా చోట్ల కంటెయినర్‌ల ఏర్పాటులో ఉన్నతాధికారులు నిర్లక్షం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద 20 మంది కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలతో పాటు ముగ్గురు సిఐలు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారని అయినా వారికి మౌలిక వసతులను కల్పించకపోవడంతో తామంతా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, చెక్‌పోస్టుల వద్ద ఎలా విధులు నిర్వహించాలని అక్కడ పనిచేసే వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తమ బాధను అర్ధం చేసుకొని కనీస సౌకర్యాలను కల్పించాలని చెక్‌పోస్టుల వద్ద పనిచేసే సిబ్బంది, అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular