-
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
స్థానికులంతా స్థానిక కోటా కిందకే
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల్లో స్థానికత అంశంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. స్థానికులంతా స్థానిక కోటా కింద అర్హులేనని సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం తీర్పును వెలువరించింది. స్థానికులు ఎవరనే అంశంపై సరైన మార్గనిర్దేశకాలు లేవని ధర్మాసనం పేర్కొంది. స్థానికత నిర్ధారణకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని సచించింది. కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది.
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల్లో స్థానికత జీవోకు సంబంధించిన అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన జీవోను పలువురు విద్యార్థులు సవాల్ చేశారు. నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో పేర్కొంది. సర్కారు జారీ చేసిన ఈ జీవో రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధమని పిటిషన్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయా పిటిషన్లపై వాదనలు విన్న సీజే ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది.