రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న డీఎస్సీ పరీక్షలను నిలిపేందుకు హైకోర్టు నిరాకరించింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, పరీక్షలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
ప్రభుత్వం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలను నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పది మంది అభ్యర్థులు వేసిన పిటిషన్‌ను విచారణకు తీసుకున్న కోర్టు.. పరీక్షలను నిలిపివేసేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి, విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయడానికి విద్యాశాఖ ఈ ఏడాది ఫిభ్రవరిలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వికారాబాద్‌కు చెందిన అశోక్, రామకృష్ణతో పాటు మరో 8 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం, పరీక్షలకు సన్నద్ధం కావడానికి తగిన సమయం ఇవ్వలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కరుణసాగర్ కోర్టుకు తెలిపారు. సిలబస్ ఎంతో క్లిష్టంగా ఉందని, అభ్యర్థులు చదువుకోవడానికి సరైన సమయం కూడా ఇవ్వలేదని విద్యా హక్కు చట్టం నిబంధనలకు ఇది విరుద్ధమని ఆయన వాదించారు. గురువారం ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు వచ్చే నెల 5వ తేదీ వరకు కొనసాగుతాయని, పరీక్షలు నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. నోటిఫికేషన్‌కు, పరీక్షకు 4 నెలల సమయం మాత్రమే ఇచ్చారని, ఈ నాలుగు నెలల వ్యవధిలో పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగులు అనేక ఆందోళనలు చేశారని కోర్టుకు వివరించారు.
గ్రూప్– 1 పరీక్షను కూడా ఇదే రీతిలో నిర్వహించి అభ్యర్థులను గందరగోళానికి గురి చేశారని, నిరుద్యోగులు ఈ నాలుగు నెలల వ్యవధిలో అనేక పరీక్షలు రాశారని, ఇదే సమయంలో ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని, జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించారని, ఇప్పుడు నిర్వహించే డీఎస్సీని వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేర్ జనరల్ రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. పదిమంది అభ్యర్థులు వేసిన పిటిషన్కోసం 2.45 లక్షల మంది నిరుద్యోగులను బలి చేయలేమని, టెట్ పరీక్షకు, డీఎస్సీకి దాదాపు నాలుగు వారాల సమయం ఉందన్నారు. పరీక్షల కోసం లక్షల మంది నిరుద్యోగులు ప్రిపేర్ అయ్యారని, ఈ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవద్దని కోర్టుకు సూచించారు. వాదనలు విన్న తర్వాత .. పిటిషన్ వేసిన పదిమంది డిఎస్సీ ఎగ్జామ్‌కోసం అప్లై చేశారా అని – హై కోర్ట్ ప్రశ్నించింది. గ్రూప్–1 తో పాటు డిఏవో, డీఎస్సీ కి అప్లై చేశారని పిటిషనర్ల న్యాయవాది చెప్పారు. అయితే, పిటిషన్ వేసిన అభ్యర్థులు డీఎస్సీ హాల్ టికెట్లు సబ్మిట్ చేయకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పదిమంది పిటిషన్ వేసి ఒకరు కూడా డీఎస్సీ హాల్ టికెట్ ను ఎందుకు సబ్మిట్ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పరీక్షలను నిలిపివేయడానికి నిరాకరిస్తూ, విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది.