Sunday, October 6, 2024

ఆస్పత్రులకు పెద్ద పెద్ద భవంతులు ముఖ్యం కాదు

ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతాయనేదే ముఖ్యం
టిమ్స్ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలతో పాటు
ఒక స్పెషలైజేషన్ వైద్యం అందించాలని భావిస్తున్నాం
నిలోఫర్ లాగా టిమ్స్ ఆసుపత్రులకూ ఒక ప్రత్యేకత ఉండాలి
వైద్యారోగ్య శాఖలో హెచ్‌ఒడిల ప్రక్షాళన జరుగుతుంది
త్వరలో హెచ్‌ఒడి పోస్టులు సృష్టించి కొత్త వారిని నియమిస్తాం
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరింహ
డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి

ఆస్పత్రులను పెద్ద పెద్ద భవంతులు ముఖ్యం కాదు అని, ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందుతాయనేదే ముఖ్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరింహ వ్యాఖ్యానించారు. టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలు కొనసాగుతాయని, అయితే 13 అంతస్తులు అనేది నిబంధన ఉంది కాబట్టి అందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. టిమ్స్ ఆసుపత్రులు 24 అంతస్తులు కట్టడం ముఖ్యం కాదని, ఆయా ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ముఖ్యమని చెప్పారు. టిమ్స్ ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలతో పాటు ఒక స్పెషలైజేషన్ వైద్యం అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. నిలోఫర్‌కు ఒక ప్రత్యేకత ఉందని.. అలాగే మిగతా వాటికి కూడా ప్రత్యేకత ఉండాలన్నారు.

ఏదైనా జబ్బు వస్తే ఫలానా ఆసుపత్రికి వెళితే ఆ జబ్బుకు ప్రత్యేక వైద్యం లభిస్తుందన్న భావన ప్రజలలో కలిగేలా టిమ్స్ ఆసుపత్రులను తీర్చిదిద్దుతామని, అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా సందర్భంగా సోమవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో వైద్యులతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, జూడాల సమ్మె సమయంలో వారి సమస్యలు 80 శాతం పరిష్కరించామని మంత్రి తెలిపారు. ఉస్మానియా హాస్టల్ భవనం లేదని, త్వరలోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రెండేళ్లలో హాస్టల్స్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణం అంశంపై ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం అనుమతిస్తే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

ప్రజలు తమ సొంత ఆసుపత్రిగా భావించేలా తీర్చిదిద్దుతాం
ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలతో పాటు మానవ వనరులు కూడా ముఖ్యమని, ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రాథమిక కేంద్రాల నుండి రిఫరల్ ఆసుపత్రుల వరకు అనుసంధానం చేసేలా వ్యవస్థను తీసుకువస్తామని చెప్పారు. ఆసుపత్రుల్లో మానవ వనరుల కొరత లేకుండా డాక్టర్ల నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అన్ని రకాల పోస్టులను భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదనపు సదుపాయాలతో పాటు ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రజలు ఇది తమ సొంత ఆసుపత్రి అని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడతామని అన్నారు. ఇప్పటికే ఆరోగ్య శాఖలో వివిధ విభాగాధిపతులు ప్రక్షాళన జరుగుతుందని పేర్కొన్నారు.

హెచ్‌ఒడిలతో సరిగ్గా పని చేయిస్తామని చెప్పారు. వైద్యుల సీనియారిటీని గౌరవిస్తూ వారి ద్వారా మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా హెచ్‌ఒడి పోస్టులు సృష్టించలేదని, ఇప్పటివరకు కేవలం ఇంఛార్జ్‌లే కొనసాగారని అన్నారు. త్వరలో హెచ్‌ఒడి పోస్టులు సృష్టించి వైద్యుల సీనియారిటీని పరిగణలోకి తీసుకుని సమర్థులను విభాగాధిపతులుగా నియమిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఫుడ్, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ అమలు వేగవంతంగా చేస్తున్నామని మంత్రి తెలిపారు.

నీట్‌పై లోతైన చర్చ జరగాలి
కేంద్రం నిర్వహించే ఏ పరీక్ష అయినా తాము నిర్వహించుకునే శక్తి ఉందని అని రాష్ట్రాలు అడుగుతున్నాయని మంత్రి దామోదర రాజనరింహ అన్నారు. ఈ మేరకు ఇటీవల నీట్ యుజి పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా మెడికల్ సీట్ల భర్తీకి నిర్వహించే నీట్ యుజి పరీక్ష రద్దు చేయాలా..? కేంద్రం నిర్వహించాలా..? రాష్ట్రాలకు ఇవ్వాలా అనే అంశంపై పార్లమెంట్, అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. మన రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఈ అంశంపై చర్చిస్తామని తెలిపారు. ఈ ఏడాది నీట్ పరీక్షకు సంబంధించిన వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేశామని..ఆ కాలేజీలకు అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఆదర్శమూర్తి బిసి రాయ్
బిసి రాయ్ జన్మదినం సందర్భంగా డాక్టర్స్ డేను జరుపుకుంటారని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. బిసి రాయ్ ఒక ఆదర్శమూర్తి అని వ్యాఖ్యానించారు. బిసి రాయ్ చరిత్ర చాలా మందికి తెలియదని.. ఆయన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. బిసి రాయ్ బెంగాల్ రెండో సిఎం అని, ఆ రాష్ట్రం దేశానికి మేధావులను ఇచ్చిన రాష్ట్రం అని చెప్పారు. అదే కోవకు చెందిన వ్యక్తి బిసి రాయ్ అని పేర్కొన్నారు. బిసి రాయ్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది డాక్టర్స్ అవార్డు ఇస్తామని వెల్లడించారు. అత్యంత పవిత్రమైన, అంకితభావంతో నిస్వార్థంగా సేవ చేయడానికి ఎంచుకునేది వైద్య వృత్తి మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్‌లో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవం కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కత్తి జనార్దన్, డాక్టర్ పూర్ణచందర్, డాక్టర్ రాంబాబు, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ అభిరామ్, డాక్టర్ శశి కుమార్, డాక్టర్ నిఖిల్, డాక్టర్ వంశీ డాక్టర్ భరత్, డాక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతి తక్కువ కాలంలోనే ప్రజారోగ్య వైద్యుల భర్తీకి 435 పోస్టులను మంజూరు చేసినందుకు మంత్రికి తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యుల నియామకాలలో వయసుకు ప్రాధాన్యతనిస్తూ సీనియారిటీ పాయింట్లు కలపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే మిగతా శాఖలో ఉన్న వైద్యుల పోస్టులను కలిపి పోస్టుల సంఖ్యను పెంచాలని కోరారు. ఈ మేరకు పబ్లిక్ హెల్త్ డాక్టర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular