ఈ ఎన్నిక చెల్లదంటున్న కొందరు సచివాలయ ఆఫీసర్స్
ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే ఓటింగ్, మిగతా పదవులు ఏకగ్రీవం
ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్న అధికారులు
తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలపై కోర్టుకు వెళ్లాని సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు యోచిస్తున్నారు. ఈనెల 18వ తేదీన తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక కాగా, టిజిఎస్‌ఓఏ అధ్యక్షుడిగా జి.సురేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పి.లింగమూర్తి, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కెఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా డి.అంజన్ కుమార్, ఎం.రాంసింగ్, మహిళా ఉపాధ్యక్షురాలిగా డి.లలితకుమారి, అడిషనల్ సెక్రటరీలుగా బి.స్వామి, కె.సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీలుగా రమాదేవి, పి.శ్రీనివాసులు, మహిళా జాయింట్ సెక్రటరీగా డి.మనోహరమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మల్లిఖార్జునరావు, ప్రచార కార్యదర్శిగా జే.శోభారాణి, కోశాధికారిగా పి.శ్యాంసుందర్, కార్యవర్గ సభ్యులుగా ఏ.శ్రీనివాస్, సిహెచ్.మధు కిరణ్, సిహెచ్.శ్రీనివాసులు, కె.లత, బి.సైదాలు ఎన్నికయ్యారు.
అయితే, ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాన కార్యదర్శి పదవికి మాత్రమే ఓటింగ్ జరిగిందని, మిగతా పదవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఇది చెల్లదని ఆరోపిస్తూ కొందరు సచివాలయ ఆఫీసర్స్ దీనిపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం పలువురు ఆఫీసర్స్ దీనికి సంబంధించి సంతకాల సేకరణ కూడా చేపట్టగా సుమారుగా 20 మంది సంతకాలు చేశారు. శనివారం కూడా ఈ సంతకాల సేకరణ అనంతరం సోమవారం కోర్టు మెట్లు ఎక్కాలని సచివాలయ ఆఫీసర్స్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో మొత్తం 185 మంది ఓటర్లు ఉండగా అందులో కొంతమంది ఈ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తుండడంతో పాటు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. అయితే ఈ ఎన్నికలు జరిగినప్పుడే అభ్యంతరం చెబితే బాగుండేదని, కొత్త కార్యవర్గం ఏర్పడ్డాక ఇప్పుడు కోర్టుకు వెళతామనడం పద్దతి కాదని మరికొందరు సచివాలయ ఆఫీసర్స్ పేర్కొంటున్నారు.