-
తెలంగాణలో మరో నయాగారా సిర్నాపల్లి జలపాతం
-
సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ చూసేందుకు క్యూ కట్టిన జనం
జలపాతం.. వాటర్ ఫాల్.. అంతెత్తునుంచి జలదారలు జాలువారుతుంటే.. ఆ దృశ్యం ఎంతసేపు చూసినా తనువుతీరదు. సమయం చిక్కాలే గాని చాలా మంది ప్రకృతి ప్రేమికులు జలపాతాలను వీక్షించేందుకు వెళ్తుంటారు. ఐతే తెలంగాణలో చాలా అందమైన జలపాతాలున్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. తెలంగాణలోని ప్రముఖ జలపాతం సిర్నాపల్లి. అవును సిర్నాపల్లి జలపాతం దట్టమైన అడవికి దగ్గరలో ఉంటుంది. సుమారు 40 అడుగుల ఎత్తు నుంచి నీటిధారలు కిందకి జాలువారుతూ ఉంటాయి. అక్కడ రకరకాల పక్షులు, పచ్చని చెట్లు ఎవరినైనా కట్టిపడేస్తాయి.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి మండలంలో సిర్నాపల్లి జలపాతం ఉంది. సిర్నాపల్లి జలపాతం ప్రస్తుతం వీకెండ్ స్పాట్ గా ఫేమస్ అయ్యింది. శని, ఆదివారాలు, ఇతర సెలవులు వస్తే చాలు సిర్నాపల్లికి వెళ్లే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. సిర్నాపల్లి గతంలో సంస్థానంగా ఉండేది. రాణి జానకి బాయి పాలనతో ఈ ప్రాంతం ఉండేది. అందుకే సిర్నాపల్లి జలపాతం దగ్గర ఉన్న అలుగును ఇప్పటికీ జానకి బాయి పేరుతోనే పిలుస్తారు. సిర్నాపల్లి గ్రామం దట్టమైన చెట్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరం నుంచి దట్టమైన అటవీ ప్రాంతం ప్రారంభమవుతుంది.
సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ ను తెలంగాణ నయాగరా అని పిలుస్తారు. హైదరాబాద్ నుంచి సిర్నాపల్లి జలపాతానికి వెళ్లాలనుకుంటే ముందుగా నిజామాబాద్ కు ట్రైన్ ద్వారా లేదా బస్సు ద్వారా చేరుకోవాలి. అక్కడి నుంచి ఇందల్వాయి మండలానికి చేరుకుని నేరుగా సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ కు వెళ్లిపోవచ్చు. తెలంగాణ నుంచే కాదు.. ఆంధ్రప్రదేశ్ నుంటి కూడా సిర్నాపల్లి జలపాతాన్ని చూసేందుకు చాలా మంది ప్రకృతి ప్రేమికులు వస్తున్నారు. విశాఖపట్నం నుంచి సిర్నాపల్లి చూడాలనుకుంటే ఇక్కడి నుంచి మూడు ట్రైన్లు నిజామాబాద్ కు వెళుతున్నాయి.