Wednesday, December 25, 2024

తెలంగాణ స్పీక‌ర్ సక్సెస్‌

అంచనాలకు అందకుండా అసెంబ్లీ నిర్వహణ

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే, విపక్షాల రాద్ధాంతం, అధికార పక్షం ఎదురుదాడి.. మధ్య మధ్యలో బీజేపీ, ఎంఐఎం విమర్శలు.. మొత్తంగా సభ అట్టుడికిపోతోంది. కానీ, ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహించడంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సక్సెస్‌ అవుతున్నారు. విపక్షాలు ఎంత లొల్లి చేసినా.. సభలో వాగ్వాదం పెట్టుకుంటున్నా.. ఇటు అధికార పక్షాన్ని కంట్రోల్‌ చేస్తూ.. సభను కూడా ఫార్మాట్‌లో నడిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు స్పీకర్‌ వ్యవహారం ప్రధాన చర్చగా మారింది. ఇటీవల నల్ల బట్టలతో ఓ రోజు, చేతులకు బేడీలతో ఇంకో రోజు.. అటోలతో డ్రైవర్ల వేషంలో మరో రోజు బీఆర్‌ఎస్‌ ఆందోళన చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఇటు బీజేపీ కూడా అందే పంథా అమలు చేస్తున్నది. ఎంఐఎం కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకుని సభలో గందరగోళం చేసే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కానీ, ఒక్క ఎమ్మెల్యేను కూడా సస్పెండ్‌ చేయకుండా.. ఎవరిపైనా మార్షల్స్‌ ప్రయోగం లేకుండా సభను నిర్వహిస్తున్న తీరు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

కూర్చోబెడుతున్నారు..!
అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూ భారతికి సభలో ఆమోదముద్ర పడింది. వీటితో పాటుగా పలు బిల్లులను ఆమోదించారు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అతి తెలివిగా వ్యవహరించేది. సభ నుంచి విపక్ష సభ్యులను బయటకు పంపించేవారు. లేకుంటే సస్పెన్షన్‌ వేటు వేసేవారు. దీంతో వాళ్ల సభ్యులే ఏవో నాలుగైదు ప్రశ్నలు అడిగినట్లుగా అడిగి.. బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం చేసుకునేవారు. అంతేకాకుండా సభ మొత్తం ఏకపక్షంగా ఉండేది. ఫలితంగా స్పీకర్‌కు కూడా పెద్దగా పనిలేదన్నట్టే వ్యవహరించేవారు.
కానీ, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చాయి. అప్పుల మీద లొల్లి ఆగడం లేదు. పాత అప్పులతో పాటుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పులు కూడా సభలో మంటలు రేపుతున్నాయి. దీనికి తోడుగా బీఆర్ఎస్‌ రోజుకో ఆందోళన చేస్తున్నది. అయితే, సభకు రావడం.. ఆందోళన చేయడం పరిపాటిగా మారింది. దీంతో తమపై సస్పెన్షన్‌ వేటు వేస్తే… మరింత ప్రచారం పెరుగుతుందనే ధోరణిలో బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్నది. కానీ, సభాపతి మాత్రం ఈసారి అసెంబ్లీ నుంచి ఒక్కరిని కూడా బయటకు పంపించడం లేదు. విపక్షాలకు కూడా అడిగినంత సమయం ఇస్తున్నారు. వాళ్లు చెప్పేది చెప్పుతున్నంత సేపు సభను కంట్రోల్‌లో పెడుతున్నారు. విపక్షాలు ఎంత రాద్ధాంతం చేసిన సభలో మార్షల్స్‌కు పని లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మార్షల్స్‌ ఎక్కువగా ఉండటంతో.. విపక్ష నేతలను సస్పెండ్‌ చేస్తారు.. సభ నుంచి ఈడ్చుకు వస్తారనే ప్రచారం జరిగింది. కానీ, అసెంబ్లీ హాల్‌లోకి ఇప్పటి దాకా ఒక్క మార్షల్‌ కూడా అడుగు పెట్టలేదంటూ సభ నిర్వహణ తీరు అర్థమవుతున్నది. ఈసారి విపక్ష, అధికార పక్షం మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్నా.. స్పీకర్‌ మాత్రం సంయమనంతో సభను నడిపిస్తున్నట్లు ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాకుండా సభలో చర్చ జరుగుతున్నంత సమయం.. రాత్రి వరకు సభను సజావుగా సాగిస్తున్నారు. దీంతో సభలో ఇప్పుడు స్పీకర్‌ సక్సెస్‌ అనేదే కీలక చర్చ.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com