Thursday, January 9, 2025

తెలంగాణ స్పీకర్‌ సక్సెస్‌ స్టోరీ

ఎంపీటీసీ నుంచి స్పీకర్‌ వరకు గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం

తెలంగాణ స్వరాఫ్ట్రంలో తొలి దళిత స్పీకర్‌‌గా గడ్డం ప్రసాద్ కుమార్ నిలిచారు. వికారాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగానూ పనిచేశారు. తెలంగాణ శాసనసభలో ఎక్కువ సభ్యులు అగ్రవర్ణాలకు చెందిన వారే ఉండగా.. స్పీకర్ పదవి దళిత నేతకు ఇవ్వడం ప్రసాద్‌ కుమార్‌ నిబద్ధతకు నిదర్శనంగా మారింది. రాజకీయ వారసత్వం కాకుండా.. స్వరాష్ట్ర ఉద్యమం నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం.. ఆయన్ను స్పీకర్‌ కుర్చీ దాకా తీసుకువచ్చింది. తెలంగాణ అసెంబ్లీ నూతన శాసన సభాపతిగా గడ్డం ప్రసాద్‌ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడమే ఒక నూతన అధ్యయనం. శాసన స్పీకర్ బాధ్యతలు చేపట్టిన తొలి దళిత నేతగా గడ్డం ప్రసాద్ కుమార్ చరిత్ర సృష్టించారు. ఆయన ఎంపీటీసీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి స్పీకర్ గా ఎన్నికయ్యారు.

రాజకీయ ఉద్యమం
గడ్డం ప్రసాద్ కుమార్.. 1964లో మర్పల్లిలో జన్మించారు. ఈయన 21 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 1984లో ఇంటర్ పూర్తి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ప్రసాద్ కుమార్.. తన సమీప అభ్యర్థి చంద్రశేఖర్‌పై గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప అభ్యర్థి చంద్రశేఖర్ (బీఆర్ఎస్)పై గెలుపొంది రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో ఉమ్మడి ఏపీలో అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూశారు. అనంతరం 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి పోటీ చేసి మెతుకు ఆనంద్‌ మీద గెలుపొందారు. అనంతరం ఆయన్ను స్పీకర్ పదవికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ అభ్యర్థిత్వానికి బీజేపీ మినహా మిగతా అన్ని పార్టీల మద్దతు లభించింది. ఆయనకు 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంఐఎం 7, సీపీఐకు చెందిన ఓ ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. దీంతో స్పీకర్ గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అయ్యింది.

స్పీకర్‌ సక్సెస్‌
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడు సెషన్లు జరిగాయి. ఈ మూడు సెషన్లలోనూ విపక్షాల రాద్ధాంతం, అధికార పక్షం ఎదురుదాడి.. మధ్య మధ్యలో బీజేపీ, ఎంఐఎం విమర్శలు.. మొత్తంగా సభ అట్టుడికింది. కానీ, ఇలాంటి సమయంలో అసెంబ్లీ సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహించడంలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ సక్సెస్‌ అవుతున్నారు. విపక్షాలు ఎంత లొల్లి చేసినా.. సభలో వాగ్వాదం పెట్టుకుంటున్నా.. ఇటు అధికార పక్షాన్ని కంట్రోల్‌ చేస్తూ.. సభను కూడా ఫార్మాట్‌లో నడిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు స్పీకర్‌ వ్యవహారం ప్రధాన చర్చగా మారింది. ఇటీవల నల్ల బట్టలతో ఓ రోజు, చేతులకు బేడీలతో ఇంకో రోజు.. అటోలతో డ్రైవర్ల వేషంలో మరో రోజు బీఆర్‌ఎస్‌ ఆందోళన చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. ఇటు బీజేపీ కూడా అందే పంథా అమలు చేస్తున్నది. ఎంఐఎం కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకుని సభలో గందరగోళం చేసే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. కానీ, ఒక్క ఎమ్మెల్యేను కూడా సస్పెండ్‌ చేయకుండా.. ఎవరిపైనా మార్షల్స్‌ ప్రయోగం లేకుండా సభను నిర్వహిస్తున్న తీరు రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

కూర్చోబెట్టుతున్నారు..!
అసెంబ్లీ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూ భారతికి సభలో ఆమోదముద్ర పడింది. వీటితో పాటుగా పలు బిల్లులను ఆమోదించారు. గతంలో ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అతి తెలివిగా వ్యవహరించేది. సభ నుంచి విపక్ష సభ్యులను బయటకు పంపించేవారు. లేకుంటే సస్పెన్షన్‌ వేటు వేసేవారు. దీంతో వాళ్ల సభ్యులే ఏవో నాలుగైదు ప్రశ్నలు అడిగినట్లుగా అడిగి.. బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం చేసుకునేవారు. అంతేకాకుండా సభ మొత్తం ఏకపక్షంగా ఉండేది. ఫలితంగా స్పీకర్‌కు కూడా పెద్దగా పనిలేదన్నట్టే వ్యవహరించేవారు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలు అంటేనే ఢీ అంటే ఢీ అనే స్థాయికి వచ్చాయి. అప్పుల మీద లొల్లి ఆగడం లేదు. పాత అప్పులతో పాటుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న కొత్త అప్పులు కూడా సభలో మంటలు రేపుతున్నాయి. దీనికితోడుగా బీఆర్ఎస్‌ రోజుకో ఆందోళన చేస్తున్నది. అయితే, సభకు రావడం.. ఆందోళన చేయడం పరిపాటిగా మారింది. దీంతో తమపై సస్పెన్షన్‌ వేటు వేస్తే… మరింత ప్రచారం పెరుగుతుందనే ధోరణిలో బీఆర్‌ఎస్‌ వ్యవహరిస్తున్నది. కానీ, సభాపతి మాత్రం ఈసారి అసెంబ్లీ నుంచి ఒక్కరిని కూడా బయటకు పంపించడం లేదు. విపక్షాలకు కూడా అడిగినంత సమయం ఇస్తున్నారు. వాళ్లు చెప్పేది చెప్పుతున్నంత సేపు సభను కంట్రోల్‌లో పెడుతున్నారు. విపక్షాలు ఎంత రాద్ధాంతం చేసిన సభలో మార్షల్స్‌కు పని లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే, తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మార్షల్స్‌ ఎక్కువగా ఉండటంతో.. విపక్ష నేతలను సస్పెండ్‌ చేస్తారు.. సభ నుంచి ఈడ్చుకు వస్తారనే ప్రచారం జరిగింది. కానీ, అసెంబ్లీ హాల్‌లోకి ఇప్పటి దాకా ఒక్క మార్షల్‌ కూడా అడుగు పెట్టలేదంటూ సభ నిర్వహణ తీరు అర్థమవుతున్నది. ఈసారి విపక్ష, అధికార పక్షం మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్నా.. స్పీకర్‌ మాత్రం సంయమనంతో సభను నడిపిస్తున్నట్లు ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాకుండా సభలో చర్చ జరుగుతున్నంత సమయం.. రాత్రి వరకు సభను సజావుగా సాగిస్తున్నారు. దీంతో సభలో ఇప్పుడు స్పీకర్‌ సక్సెస్‌ అనేదే కీలక చర్చ.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com