- ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి
- అంతకు ముందే కేబినేట్‌లో చర్చించి ఆమోదం
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో బుధవారం ఉదయం 11.14 గంటలకు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ముందుగా కేబినేట్ ఆమోదించాల్సి ఉంటుంది. దీంతో ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాలులో మంత్రివర్గ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలుపనుంది.
అనంతరం బడ్జెట్ కాపీలతో భట్టి విక్రమార్క అసెంబ్లీకి చేరుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది రెండో బడ్జెట్ కావడం విశేషం. బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏ పథకానికి ఏ మేరకు కేటాయింపులు ఇవ్వబోతున్నదనేది ఆసక్తిగా మారింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.