మాంసాహారాన్ని ఎక్కువగా తింటున్న రాష్ట్రాలివే.. టాప్ 10లో 7 స్థానంలో తెలంగాణ
మాంసాహారాన్ని ఎక్కువగా తినే రాష్ట్రాల్లో సౌత్ వెనకబడింది. తెలంగాణలో నాన్‌వెజ్ ఎక్కువగా తింటారు అనుకుంటారు. కానీ ఇండియాలో మాంసాహారాన్ని ఎక్కువగా తినే టాప్ 10 రాష్ట్రాల్లో తెలంగాణ 7 స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణను బీట్ చేసింది. నేషనల్ హెల్త్ ఫ్యామిలీ సర్వే (NHFS-5) ప్రకారం.. ఇండియాలో మాంసాహారాన్ని తింటున్న రాష్ట్రాల లెక్క తీశారు.
టాప్ 10 రాష్ట్రాలివే..
NHFS-5 చేసిన సర్వే ప్రకారం.. భారత్‌లో మాంసాహారాన్ని ఎక్కువగా తింటున్న రాష్ట్రాల్లో నాగాలాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ప్రాంతంలో 99.8% మంది ప్రజలు నాన్ వెజ్ తింటున్నారట. తర్వాతి స్థానంలో 99.3 శాతంతో పశ్చిమ బెంగాల్ ఉంది. మూడో స్థానంలో 99.1 శాతంతో కేరళ ఉండగా.. 98.25 శాతంతో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచింది. తర్వాత తమిళనాడు 97.65శాతం ఉండగా, ఒడిశా 97.35, తెలంగాణ 97.3తో 7 స్థానంలో నిలిచింది. ఎనిమిదో స్థానంలో 97 శాతంలో జార్ఖండ్, త్రిపుర 95, గోవా 93.8తో చివరి స్థానంలో ఉంది.
నాన్‌వెజ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. అలాగే నష్టాలు కూడా ఉంటాయి. రోజూ నాన్‌వెజ్ తినడం తప్పు కాదు కానీ.. ఎలా తినాలో తెలియకపోతేనే ఆరోగ్యానికి నష్టాలు కలుగుతాయి. మరి మాంసాహారాన్ని ఎలా తినాలి? ఎలా డైట్లో చేర్చుకుంటే మంచిది.. నాన్‌వెజ్ ఎక్కువగా తింటే శరీరానికి అధిక నాణ్యతతో కూడిన ప్రోటీన్ అందుతుంది. ఇది కండరాల పెరుగుదలకు, నిర్వహణకు మంచిది. అలాగే మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి పనితీరుకు మంచివి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మంచివి. విటమిన్ బి12 అందుతుంది. ఇది నరాల పనితీరు మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది.
ఇలా తీసుకుంటే మంచిది..
ప్రోటీన్ కోసం పౌల్ట్రీ, చేపలు తీసుకుంటే మంచిది. ప్రాసెస్ చేసిన నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలి. మాంసం ద్వారా వ్యాధులు రాకుండా ఉండాలంటే బాగా ఉడికించుకోవాలి. సరిగ్గా ఉడకని నాన్‌వెజ్ జోలికి అస్సలు వెళ్లకూడదు. కేవలం నాన్‌వెజ్ కాకుండా.. వెజిటేబుల్స్‌ని కూడా మీ ప్లేట్లో ఉండేలా చూసుకోండి. సమతుల్య ఆహారం మంచిది.
నాన్‌వెజ్ తింటే కలిగే నష్టాలు
మాంసాహారంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిలోని కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు బ్యాక్టీరియాతో కలుషితమై అనారోగ్యాలకు దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్ వెజ్ తినేప్పుడు దొరికిందల్లా తినేయకుండా హెల్తీగా తీసుకునేందుకు ప్రయత్నించండి.