రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం (మే 13) 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు మూసేయాలని ఎన్నికల సంఘం ముందుగా ఆదేశాలు జారీ చేసింది. వైన్ షాపులతో పాటుగా వివిధ జిల్లాలు, నగరాల్లో బార్లు, కల్లు కాపౌండ్ కూడా మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత రెండ్రోజులుగా మందుబాబులకు మద్యం దొరకటం లేదు.
ఈసీ ప్రకటించినట్లుగా సోమవారం సాయంత్రం వైన్ షాపులు ఓపెన్ అవుతాయని వారు ఆశగా ఎదురు చూశారు. కానీ, ఇంతలోనే హైదరాబాద్ నగరంలో మందుబాబులకు పోలీస్ కమిషనర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైన్ షాపులు, బార్లు తెరవటానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేశారు. మే 14 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. పోలింగ్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వెల్లడించారు.