త్వరలో సీఎం మార్పు ఖాయమంటూ బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారని ఆయన జోస్యం చెప్పారు. దీపాదాస్ మున్షీని రేవంత్ మ్యానేజ్ చేస్తున్నారనే అధిష్టానం ఆమెను తప్పించిందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పిస్తారని, అంతేకాకుండా ఆయన్ను పార్టీనుంచి బహిష్కరిస్తారని అన్నారు. దీపాదాస్ మున్షీని రేవంత్ మ్యానేజ్ చేస్తున్నారనే ఇక్కడి నుంచి పంపిచారని, నెక్స్ట్ తీసేది రేవంత్‌నే అంటూ ఎర్రబెల్లి కీలక కామెంట్స్ చేశారు. ఆ పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని అన్ని పరిణామాలను సైలెంట్‌గా గమనిస్తోందని తెలిపారు.
రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకుంటున్నాడు
సీఎం పదవి కోసం రేవంత్, రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకుంటున్నాడని అని అన్నారు. రాహుల్ మెప్పు కోసమే కేసీఆర్,మోదీపై రేవంత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. త్వరలో తెలంగాణలో పది స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఓడిపోవడం ఖాయమని, బీఆర్ఎస్ అన్ని స్థానాల్లోభారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎర్రబెల్లి. తాను అసందర్భంగా ఏదీ పడితే అది మాట్లాడనని.. తన సర్వే ఎప్పుడు కూడా తప్పు కాలేదని చెప్పుకొచ్చారాయన. ప్రస్తుతం ఎర్రబెల్లి చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది
ఇటీవల కూడా ఎర్రబెల్లి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ త్వరలో కూలబోతుందన్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని ఆరోపించారు. ఇది సర్కార్ కూలిపోడానికి మొదటి సంకేతమన్నారు. సీఎం రేవంత్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నమ్మట్లేదని.. రేవంత్ చెప్పేవన్నీ అబద్ధాలని రాహుల్‌కు అర్ధమైపోయిందన్నారు. కేసీఆర్‌ను ఎందుకు వదులుకున్నామా అని జనాలు కూడా బాధపడుతున్నారంటూ ఎర్రబెల్లి కామెంట్స్ చేశారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే.. బీఆర్ఎస్ కు 100 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని 10 ఏళ్లు అద్భుతంగా పాలిస్తే.. కాంగ్రెస్ 15 నెలల్లోనే అన్ని రంగాల్లో దివాలా తీయించిందన్నారు.