Sunday, September 29, 2024

ప్రాధాన్యత క్రమంలోసాగునీటి ప్రాజెక్టుల పూర్తి..!

పెండింగ్‌ ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరు నెలల్లో వీలైనంత ఆయకట్టును సాగునీటిని అందించే ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని సూచించారు. ఈ వరుసలో రాబోయే రెండేండ్లలో పూర్తయ్యే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ శాఖకు దిశా నిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు నిర్ణీత గడువుతో పాటు లక్ష్యాలను నెరవేర్చందుకు వీలుగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. గురువారం జలసౌదలో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడో అయిదేండ్లకు ఆరేండ్లకు పూర్తి కాని ప్రాజెక్టులపై దృష్టి పెట్టి అక్కడ నిధులు ఖర్చు చేస్తే లాభం లేదని అన్నారు. ఇప్పటికే 75 శాతం, అంతకు మించి పనులు చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే వచ్చే ఖరీఫ్ లోగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశముందని సీఎం తెలిపారు. అటు గోదావరి బేసిన్, ఇటు కృష్ణా బేసిన్ లో ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టులకు నిధులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు.

తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించే ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు చేయాలని చెప్పారు. పనులు పూర్తి చేసేందుకు ఉన్న అడ్డంకులు, అవరోధంగా ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రధానంగా విద్యుత్తు విభాగంతో కొన్ని బిల్లుల చెల్లింపుల సమస్యలున్నాయని అధికారులకు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇతర విభాగాలతో సమన్వయం లోపిస్తే పనులు ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదని, వెంటనే ట్రాన్స్​కో, జెన్​కో , డిస్కంలతో ఇరిగేషన్ విభాగం జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. భూసేకరణ వేగంగా పూర్తయ్యేందుకు రెవిన్యూ విభాగంతోనూ సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టులను వేగంగా చేపట్టేందుకు ఈ మూడు విభాగాలు కలిపి సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. ఇంజనీర్లు ఆఫీసుల్లో ఉండే కుదరదని, ఐఏఎస్ అధికారుల నుంచి ఇంజనీర్లు అందరూ క్షేత్రస్థాయికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలతో అసంపూర్తిగా ఆగిన పనులు వేగం పుంజుకుంటాయని చెప్పారు. రాష్ట్ర సాధనలో సాగునీటి విభాగంలో పని చేసిన ఇంజనీర్లు అత్యంత కీలకమైన పాత్ర పోషించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

అందుకే ఇరిగేషన్ విభాగంలో పని చేసే ఇంజనీర్లందరూ తమది సాదాసీదా ఉద్యోగం కాదని.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల భావోద్వేగంతో ముడిపడి ఉందనే లక్ష్య సాధనతో పని చేయాలని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. సాగునీటి విభాగంలో కొత్తగా చేరిన యువ ఏఈఈలతో ఇప్పుడున్న ఇంజనీర్లపై పనిభారం కొంతమేరకు తగ్గుతుందని అన్నారు. పనులు చేపట్టి భూసేకరణ నిలిచిపోయిందనే సమస్య తలెత్తకుండా చూసుకోవాలని, కొనసాగుతున్న ప్రాజెక్టులన్నింటిలోనూ ముందుగా భూ సేకరణ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. భూసేకరణలోనూ మానవీయత ఉండాలని, భూములు ఇచ్చే వారితో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సంప్రదింపులు జరపాలని చెప్పారు. చిన్న కాళేశ్వరం, మోడికుంటవాగు, లోయర్ పెన్ గంగా, ఛనఖా కొరటా, జే చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, కోయిల్ సాగర్ లిఫ్ట్, మహాత్మగాంధీ కల్వకుర్తి లిఫ్ట్, జహహర్ నెట్టెంపాడు లిఫ్ట్, రాజీవ్ భీమా లిఫ్ట్, ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్, ఎస్సారెస్పీ 2, సదర్‌మట్ బ్యారేజ్, నీల్వాయి, పాలెంవాగు ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు అవకాశాలున్నాయని ఇరిగేషన్ అధికారులు ఈ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుల వారీగా పురోగతిని, ఎంత కాలంలో పనులు పూర్తి చేసే అవకాశముంది.. ఎన్ని నిధులు కావాలనే వివరాలను ముఖ్యమంత్రికి నివేదించారు. అనంతరం సీఈలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్ఈలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీ అనిల్​కుమార్​ పాల్గొన్నారు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular