- డ్రైవర్ వీసా… కానీ గొర్రెల కాపరి పని
- ‘ప్రవాసీ ప్రజావాణి’ లో తల్లి ఫిర్యాదు
సిద్దిపేట జిల్లా ఇరుకోడు గ్రామానికి చెందిన గోల్కొండ రాజవర్ధన్ రెడ్డి సౌదీ అరేబియాలోని హాయిల్ ప్రాంతంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో చిక్కుకున్నాడని రక్షించి వాపస్ తెప్పించాలని అతని తల్లి లక్ష్మి వేడుకుంటున్నారు. మంగళవారం హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో ఈమేరకు ఆమె ఫిర్యాదు చేశారు. ఆమె వెంట గల్ఫ్ కార్మిక సంఘం నాయకులు మంద భీంరెడ్డి, మహ్మద్ బషీర్ అహ్మద్ ఉన్నారు.
రాజవర్ధన్ ను ఆరు నెలల క్రితం డ్రైవర్ వీసాపై సౌదీకి తీసికెళ్లిన ఏజెంట్ గొర్రెల కాపరి, ఇతర వ్యవసాయ పనులు చేయిస్తున్నాడని, శారీరక మానసిక హింసలకు గురిచేస్తున్నాడని తల్లి లక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం ఏ. రేవంత్ రెడ్డి చొరవతీసుకుని తన కుమారున్ని సౌదీ యజమాని చేర నుంచి విడిపించాలని ఆమె కోరారు. సౌదీకి తీసికెళ్లిన ఎజెంటే సూపర్ వైజర్‌గా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె వాపోయారు.