- ఒక చోట చేరి సంబురాలను చేసుకున్న ప్రవాస భారతీయులు
- అభినందనలు తెలిపిన సిఎం రేవంత్, ప్రముఖులు
కెనడాలోని టోరంటోలో పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రవాస భారతీయులంతా ఒక చోట చేరి సంబురాలను చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి సిఎం రేవంత్ అభినందనల సందేశం పంపారు. ఈ ఏడాది జూన్‌తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాసులు ‘తెలంగాణ నైట్ పేరు’తో ఈ ఉత్సవాలను నిర్వహించారు. టోరంటో, మిసిసాగ ఈ వేడుకలకు వేదిక అయ్యింది. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (టిడిఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు వందలాది మంది తెలంగాణ వాసులు కుటుంబాలతో సహా హాజరయ్యారు. అందరూ ఒక్క చోట చేరి తెలంగాణ ఆట, పాటలతో సందడి చేశారు. మూడు గంటలకు పైగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఆద్యంతం ఉత్సాహంగా గడిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, బిజెపి సీనియర్ నేత ఈటల రాజేందర్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ కవి రచయిత అందెశ్రీ, ఇతర ప్రముఖులు టిడిఎఫ్ అభినందనల సందేశాలు పంపారు.
అభివృద్ధి, సంక్షేమం వైపు పయనించేలా…
ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి, మార్గదర్శకత్వంలో 2005లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేశామని, ఉద్యమకాలంలో సొంత రాష్ట్రం కోసం ఎంత ఆరాట పడ్డామో, సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం వైపు పయనించేలా తమ వంతు పాత్ర ఇప్పటికీ తెలంగాణ ఎన్నారైలు పోషిస్తు న్నారని టిడిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి పెద్ది తెలిపారు. తెలంగాణ ఎన్ఆర్ఐ లు అంటే బ్రతికేందుకు బయటి దేశం పోయినోళ్లు కాదు, రాష్ట్ర సాధనతో పాటు, నిర్మాణంలోనూ పాటు పడుతు న్నామన్న ఆదర్శంతో టిడిఎఫ్ పనిచేస్తుందని అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గార్లపాటి అన్నారు. తెలంగాణ అస్థిత్వానికి కృషి చేసిన కవులు, కళాకారులను స్మరించి గౌరవిస్తూ, సన్మానించుకోవటం, అమరుల కుటుంబాలను తోచినంతలో ఆదుకోవటం తెలంగాణ డెవలప్మెంట్ ద్వారా చేస్తున్నామని నిర్వాహ కులు తెలిపారు. ఇక కెనడాలో స్థిరపడాలని వచ్చే వృత్తి నిపుణులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు ప్రతి ఏటా కెనడాకు వస్తున్న తెలుగు విద్యార్థులకు అండగా టిడిఎఫ్ నిలుస్తోందన్నారు.
నిత్య జీవిత ఒత్తిడులను జయించేందుకు ఆటపాటలే మార్గం అని భావించి స్పోర్ట్ క్లబ్‌ను ఏర్పాటు చేసి క్రికెట్‌తో సహా వివిధ రకాల టోర్నమెంట్ల నిర్వహణ కూడా డెవలప్మెంట్ ఫోరం చేస్తోందన్నారు. తెలంగాణకు భౌతికంగా దూరంగా ఉంటున్నా, పుట్టిన ప్రాంతంలో ఉన్న సంప్రదాయాలు, ఆచారాలు, పండుగలకు దూరం కాకుండా టిడిఎఫ్ గొడుగు కింద కెనడాలో అస్థిత్వాన్ని కాపాడుకుంటున్నామని, తంగేడు సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ప్రతి యేటా బతుకమ్మ ఉత్సవాలతో పాటు, వివిధ సందర్భాల్లో కమ్యూనిటీ ఈవెంట్లను నిర్వహిస్తూ అందరం కలుస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశేష అతిథిగా అమెరికా నుంచి వాణి గడ్డం, ఇండియా నుంచి సీనియర్ జర్నలిస్ట్ శ్రీకాంత్ బంధు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నెరవెట్ల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రమోద్‌కుమార్ ధర్మపురి, టిడిఎఫ్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు హాజరయ్యారు.