Sunday, April 20, 2025

బడికెళ్తున్న సమయంలో ప్రమాదం పదో తరగతి విద్యార్థిని మృతి

బడికెళ్లిన కుమార్తె తిరిగి వస్తుందనుకున్నారు. రోజులాగే వెళ్లిన బిడ్డ కానరాని లోకాలకు వెళ్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉండరు. అనుకోని ప్రమాదంలో టస్కర్ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. బిడ్డా ఒక్కసారి లేరా అని ఘోషిస్తున్న ఆ తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. పాఠశాలకు వెళ్తున్న క్రమంలో మృతి చెందిన ఘటన అందరి హృదయాల్ని కలచివేస్తోంది.

శనివారం ఉదయం 7:45 నిమిషాలకు హబ్సిగూడలో చోటు చేసుకున్న తీవ్ర రోడ్డు ప్రమాదంలో సాత్విక అనే అమ్మాయి మృతి చెందింది. తార్నాకలో తన కుటుంబంతో కలిసి నివాసముంటున్న రంగ గోపి కుమార్తె సాత్విక, హబ్సిగూడలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ప్రతి రోజులాగే స్కూల్​కు వెళ్లేందుకు బయలు దేరిన సాత్విక, తార్నాకలో ఎల్లయ్య అనే వ్యక్తి ఆటో ఎక్కింది. ఆటో హబ్సిగూడ చేరుకున్న తర్వాత సిగ్నల్ పడటంతో ఆగింది. ఆటో ఎదుట బస్సు, వెనక టస్కర్‌. టస్కర్‌ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ముందున్న ఆటోను ఢీకొట్టడంతో ఆటో బస్సు కిందకు దూసుకెళ్లింది. అయితే, ఆటోలో ఉన్న డ్రైవర్ ఎల్లయ్యతో పాటు సాత్వికను స్థానికులు, పోలీసులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే సాత్విక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆటో డ్రైవర్ ఎల్లయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన బాలిక మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. TS 15 UA 4649 నంబర్ గల టస్కర్‌ బాలిక ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని గుర్తించిన పోలీసులు, డ్రైవర్​పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

అందరి హృదయాల్ని కలిచివేసిన విద్యార్థిని మృతి

హాస్పిటల్ వద్ద మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, పాఠశాల సిబ్బంది రోదనలు మిన్నంటాయి. ఆటో డ్రైవర్ కూడా తీవ్రగాయాలతో ప్రస్తుతం నాచారంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోజులాగే పాఠశాలకు వస్తుందనుకున్న మిత్రులు, బడి చివరి గంట కొట్టగానే తిరిగి వస్తుందనుకున్న తల్లిదండ్రుల ఆశలను టస్కర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించేసింది. రోడ్డు ప్రమాదాల్లో మనం సరిగా వెళ్లినా ఎదుటివారి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే వాహనం నడిపే సమయంలో జాగ్రత్తతో పాటు అప్రమత్తత కూడా అవసరమని పోలీసులు చెబుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com