తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్ పేపర్ లీక్ కలకలం సృష్టిస్తోంది. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని టీఎస్‌డబ్ల్యూఆర్ గురుకుల పాఠశాలలో ఇన్విజిలేటర్ పేపర్ లీక్ చేశాడు. ఎగ్జామ్ పేపర్‌ను ఫోటో తీసి బయటకు పంపాడు. దీంతో అధికారులు ఇన్విజిలేటర్‌ను సర్వీసు నుంచి తొలగించారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. మార్చి 21న విద్యార్థులు తెలుగు పరీక్షకు హాజరయ్యేరు. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పేపర్ లీకేజ్ తో గందరగోళం నెలకొంది. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని గురుకుల పాఠశాలలో ఇన్విజిలేటర్ తెలుగు పేపర్ లీక్ చేసినట్లు తెలిసింది. పరీక్ద స్టార్ట్ అయ్యే ముందే ఎగ్జామ్ పేపర్‌ను ఫోటో తీసి బయటకు పంపించాడు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఇన్విజిలేటర్ ని విధుల నుంచి తొలగించారు. అలాగే సెంటర్ లోని మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఓ ఓ విద్యార్థిని డీబార్ కూడా చేశారు.
ఇదిలా ఉంటే మరో కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. తెలుగు పేపర్‌కు బదులు విద్యార్థులకు హిందీ పేపర్ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత తప్పిదాన్ని గుర్తించిన అధికారులు సరైన పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు. కానీ అప్పటికీ రెండు గంటలు గడిచిపోయింది. ఈ సంఘటన మంచిర్యాలలోని బాయ్స్ హై స్కూల్‌లో చోటుచేసుకుంది.
అనంతరం విషయం తెలిసి ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చిన జిల్లా కలెక్ట్ కుమార్ దీపక్ విద్యాధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నాపత్రాల గందరగోళంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.