తిరుమల తిరుపతి దేవస్ధానంలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుత్ దీపకాంతులతో, రంగురంగుల పుష్పాలంకరణలతో శోభాయమానంగా ముస్తాబైన తెప్పపై సీతారామలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా, సాయంత్రం 6 గంటలకు సీతారామలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు ఆలయ నాలుగు మాడ వీధుల గుండా సాగి పుష్కరిణికి చేరుకుంది. అనంతరం, మొదటిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి పుష్కరిణిలో మూడుసార్లు తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, గాన, నాదాల నడుమ తెప్పోత్సవం కన్నుల పండుగలా జరిగింది. ఈ వేడుకలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, తదితరులు పాల్గొన్నారు.