-
మాలిలో ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మృతి
-
అల్ ఖైదా తీవ్రవాద సంస్థ పనేనని అనుమానం
ఆఫ్రికా ఖండంలోని మాలిలో విషాదం చోటుచేసేకుంది. గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 26 మంది చనిపోయారు. మాలిలోని బుర్కినాఫసోతో ఉన్న దేశ సరిహద్దుల్లో సోమవారం ఈ ఘటన జరిగింది. డెంబో అనే చిన్న పల్లెటూరిలోని పొలాల్లో స్థానికులు పనిచేస్తుండగా, దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు అధికారులు చెప్పారు.
ఐతే ఈ కాల్పులకు సంబందించి ఏ వర్గమూ బాధ్యత వహించలేదు. మాలిలో ఈ మధ్య కాలంలో ఈ తరహా దాడులు పెరిగిపోయాయి. మాలి సైన్యం ఇలాంటి దాడులను అడ్డుకోలేకపోతోందని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడి గ్రామీణ ప్రజలపై తీవ్రవాద సంస్థ అల్ ఖైదాకు అనుబంధ గ్రూపు జేఎన్‌ఐఎం దాడులకు తెగబడుతోంది. మాలి సమీపంలో గత నెల ఓ పెళ్లి వేడుకలో కాల్పులు జరిపి 21 మంది ప్రాణాలను బలగొంది.
తాజాగా డెంబో పల్లెలో జరిగిన దాడి సైతం జేఎన్‌ఐఎం ఉగ్ర సంస్థ పనే అయ్యుంటుందని అనుమానిస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలోని నగరాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న తీవ్రవాద సంస్థలను ఫ్రెంచి భద్రతా దళాల సాయంతో దేశ సైన్య బలగాలు తరిమేశాయి. వారంతా ఇప్పుడు గ్రూపుగా ఏర్పడి దేశంలోని పల్లెలు, సైనికులపై దాడులకు పాల్పడుతున్నారు.