24 మంది మృతి, ఐదుగురి పరిస్థితి విషమం
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసారన్ మైదానంలో ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన కాల్పుల్లో కనీసం 24 మంది మృతి చెందారు, 10 మందికి పైగా గాయపడ్డారు . ఈ దాడి భారతీయ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని, పహల్గాం ప్రాంతంలో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా భావిస్తున్నారు. ఈ దాడి సమయంలో పర్యాటకులు భోజనం చేస్తుండగా, ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించారు. గాయపడిన వారిని స్థానిక దవాఖానలకు తరలించారు.
ఘటన జరిగిన వెంటనే భద్రతా దళాలు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. అమిత్ షా శ్రీనగర్‌కు బయలుదేరి, భద్రతా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ దాడి పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరగడం, కాశ్మీర్‌లో పర్యాటకుల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఇది 2019లో కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేసిన తర్వాత, పర్యాటకులపై జరిగిన అరుదైన దాడుల్లో ఒకటిగా భావిస్తున్నారు .
కాగా ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. నిరాయుధులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవాదులు దట్టమైన అడవి వైపు పారిపోయారు. అయితే, భద్రతా సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. బైసరన్ లోయలోని పర్వతం నుంచి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు దిగి వచ్చి అక్కడి పర్యాటకులపై కాల్పులు జరిపారు. దాడి జరిగిన వెంటనే, భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.