* జమ్మూ కశ్మీర్ లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
* నలుగురు జవాన్లు మృతి- ఆరుగురికి తీవ్ర గాయాలు
ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో భారత ఆర్మీకి చెందిన కాన్వాయ్‌పై టెర్రరిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో నలుగురు జవాన్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కధువా జిల్లాలోని మాచేడి కిండ్లీ మల్హార్ రోడ్డు మార్గంలో ఆర్మీ జవాన్లు రెగ్యులర్ విధుల్లో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఉగ్రవాదుల దాడిలో గాయపడిన ఆర్మీ జవాన్లను ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు.
జమ్మూ కశ్మీర్ లో టెర్రిస్టులు పక్కా పధకం ప్రకారం ఆర్మీ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారు. ముందు మాచేడి కిండ్లీ మల్హార్ రోడ్డు మార్గంలో వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారు. వాహనం ఆగిపోవడంతో వెంటనే కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. తేరుకున్న అర్మీ బలగాలు తేరుకుని ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు మొదలుపెట్టారు. దీంతో వారు అక్కడి నుంచి సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఉగ్రదాడి సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలు అక్కడికి చేరుకొని కూంబింగ్ ప్రారంభించాయి. ఇంకా దగ్గర్లో ఎవరైనా టెర్రరిస్టులు ఉన్నారేమోనని సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.