ఫిబ్రవరి 7న గీతా ఆర్ట్స్ సమర్పరణలో బన్నీవాస్ నిర్మించిన చిత్రం ‘తండేల్’. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి చందు మొడేటి దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వైజాగ్, చెన్నై, ముంబైలలో పలు ఈవెంట్లను చిత్ర బృందం నిర్వహించింది. ఈ ఆదివారం హైదరాబాద్‌లో ‘తండేల్ జాతర’ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
ముందుగా ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. కానీ, చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ వేడుకకు హాజరు కాలేదు. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటన తర్వాత ఆయనపై కేసు నమోదు కావడం, అరెస్టు, ఆపై బెయిల్ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ కారణంగానే బన్నీ కొంతకాలం పాటు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ‘తండేల్’ చిత్రానికి సరైన బజ్ లేదని భావించిన నిర్మాత బన్నీ వాస్, తన స్నేహితుడైన అల్లు అర్జున్‌ను ఈ వేడుకకు రావాలని ఒప్పించాడు. ఇందుకోసం ముందుగా ప్రకటించిన తేదీని కూడా మార్చారు. అంతేకాకుండా, ఈ వేడుకకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో, ఇండోర్ ఫ్లోర్‌లో అతికొద్ది మందితో, మీడియా, చిత్ర యూనిట్‌తో వేడుక జరుపుకుంటామని అనుమతి కోరారు. దీనికి పోలీసు శాఖ అంగీకరించింది. కానీ, అల్లు అర్జున్‌ను మాత్రం వేడుకకు హాజరు కావద్దని సూచించినట్లు సమాచారం. సరిగ్గా ఇదే రోజున సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదని వైద్యులు తెలిపారు. ఈ కారణాలన్నింటి వల్ల అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలిసింది. బహిరంగ కార్యక్రమాలను కాస్త దూరంగానే ఉండాలి మరి అని కొందరుసోషల్‌మీడియాలో అంటున్నారు.