- ఇందు కోసం జెండాలు, అజెండాలను పక్కనబెడదాం..
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించం
- కులసర్వేలో బీసీల లెక్క వందశాతం సరైనదే..
- శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జెండాలు, అజెండాలు పక్కనబెట్టి కేంద్రంలో కొట్లాడి బిసి బిల్లును సాధిద్దామని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదిం చుకో వాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేవారు. కామారెడ్డి ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కులసర్వేలో పొందుపరిచిన బీసీల లెక్క వందశాతం సరైంది. కాంగ్రెస్ అధికారంలోకి వొస్తే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మేం బాధ్యతలు చేపట్టగానే 2024 ఫిబ్రవరి 4న బీసీ కులగణన ప్రక్రియను మొదలు పెట్టాం. కులసర్వేలో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజే స్తున్నా.
తెలంగాణ సమాజం బలహీన వర్గాలకు రిజర్వేషన్ల విషయంలో ఏకాభిప్రా యంతో ఉందనే సందేశం ఈ సభ ద్వారా పంపించాలనుకున్నాం. బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదన పంపించింది. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు గత ప్రభుత్వం గవర్నర్ కు పంపిన ప్రతిపాదనను ఉపసంహరించుకుని కొత్త ప్రతిపాదన పంపిస్తున్నాం. 4 ఫిబ్రవరిని సోషల్ జస్టిస్ డేగా సభ ద్వారా తీర్మానం చేశాం. అందరినీ సంప్రదించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలనే ఈ బిల్లును తీసుకొచ్చాం.సభా నాయకుడిగా బీసీ రిజర్వేషన్ల సాధనకు నేను నాయకత్వం వహిస్తా. అఖిలపక్ష నాయకులు అందరం కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దాం.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుందాం. ఇందుకోసం ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ సభాపక్షనాయకుడు తీసుకోవాలి. రాహుల్ గాంధీని కూడా కలిసి పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావిం చాలని కోరదాం. రాహుల్ గాంధీ సమయం తీసుకోవాల్సిందిగా తమ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు బాధ్యత అప్పగిస్తున్నా. బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని, కామారెడ్డి ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.