వివాదాస్పదంగా మారిన ఓ ఐఏఎస్ అధికారి తీరు…
ఖర్చులో తగ్గేదేలే అంటూ ముందుకు…..
రూ.2 కోట్లతో ఛాంబర్, రూ. 65 లక్షలతో కారు కొనుగోలు
ప్రభుత్వ అనుమతి లేకుండానే ఛాంబర్ నిర్మాణం
-ప్రస్తుత ఆర్థికమాంద్యంలో ఆ ఐఏఎస్ దుబారా ఖర్చు…!
ఈ అధికారి తీరుతో అవాక్కవుతున్న ఉద్యోగులు
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉందని, ఖర్చు చేసేటప్పుడు వెనుకాముందు చూసి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఐఏఎస్‌లకు, అధికారులకు సూచిస్తున్నా ప్రభుత్వం మాటను కొందరు ఐఏఎస్‌లు, అధికారులు పెడచెవిన పెడుతున్నారు. తమకు ఉన్న అధికారంతో, లేనిపోని ఖర్చులు చేసి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ఇలా ఓ ఐఏఎస్ తనకున్న అధికారంతో మంచిగా ఉన్న ఛాంబర్‌ను కూలగొట్టించి దాని స్థానంలో కొత్త చాంబర్‌ను నిర్మించుకోవడం, దానికోసం టెండర్‌లను పిలవకపోవడం, కనీసం దానికి అనుమతులు కూడా తీసుకోవాలని ఆ ఐఏఎస్ భావించకపోవడంతో ఆ ఐఏఎస్ వ్యవహార శైలిపై ఆ శాఖ ఉద్యోగులు ముక్కున వేలేసుకుంటున్నారు. జనవరి నెలలో ఆ శాఖ బాధ్యతలు చేపట్టగానే ఆ ఐఏఎస్ తాను చాలా నిజాయితీ అధికారి అని ఉద్యోగులకు తెలియచెప్పేలా పలువురు అవినీతి అధికారులపై చర్యలు చేపట్టారు. దీంతో ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులు తమకు నిజాయితీ గల ఐఏఎస్ వచ్చారని భావించే లోపే ప్రస్తుతం ఈ ఐఏఎస్ తీసుకుంటున్న నిర్ణయాలతో కొత్త వివాదాలు చుట్టుముట్టడం విశేషం.
బాధ్యతలు స్వీకరించగానే ఛాంబర్‌కు మరమ్మతుల పేరిట….
రాష్ట్రంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే శాఖకు ఆ ఐఏఎస్ ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఖర్చులో తగ్గేదేలే అంటూ వ్యవహారించడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. జనవరిలో బాధ్యతలు స్వీకరించిన ఆ ఐఏఎస్ వెంటనే తన ఛాంబర్‌ను మరమ్మతుల పేరిట కూల్చివేయించారు. ఎలాంటి టెండర్‌లు లేకుండానే దానిని నిర్మించే బాధ్యతలను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అలా మరమ్మతుల పేరుతో సుమారుగా రూ.2 కోట్లను ఖర్చు చేసి ప్రస్తుతం నూతన చాంబర్ నిర్మాణం పూర్తి చేయించారు. అయితే ఎన్నికల కోడ్ ఉన్నా వెంట వెంటనే నూతన చాంబర్ నిర్మాణానికి అయిన నిధులను సైతం ఆ కాంట్రాక్టర్‌కు ఆర్ అండ్ బి నుంచి ఈ ఐఏఎస్ చెల్లింపులు చేయించినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు ఎవరైతే ఆ చాంబర్ పనులు చేపట్టారో ఆ కాంట్రాక్టర్ గత చాంబర్‌లో ఉన్న టైల్స్‌ను, మిగతా సామగ్రిని చడీచప్పుడు లేకుండా అక్కడి నుంచి బయటకు తరలించి విక్రయించినట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖకు చెందిన ఏ వస్తువైనా అది మరమ్మతులకు గురైనా దెబ్బతిన్నా ప్రభుత్వ అనుమతులు లేకుండా విక్రయించడం విరుద్ధం. ఇలా ఆ కాంట్రాక్టర్‌కు మేలు చేసేలా ఈ ఐఏఎస్ వ్యవహారిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రూ.65 లక్షల పైచిలుకుతో కొత్త కారు….
ఇంతటితో ఆ ఐఏఎస్ ఆగలేదు. కొత్తగా రూ.65 లక్షల పైచిలుకుతో కారును సైతం కొనుగోలు చేశారు. అయితే దీనికి కూడా అనుమతులు తీసుకోలేదని ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సచివాలయంలో ఓ కీలక అధికారికి ఈ ఐఏఎస్ చాలా దగ్గర కావడం, వారి ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతోనే తాను ఏదీ చేయాలనుకుంటే దానిని ఇక్కడ అమలు చేస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ శాఖ బాధ్యతలు స్వీకరించిన ఐదు నెలల్లోనే సొంతంగా సుమారుగా రూ.2 కోట్ల పైచిలుకు నిధులను అడ్డగోలుగా వినియోగించడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ ఐఏఎస్ ఈ శాఖలో బాధ్యతలు చేపట్టిన ఐదునెలల్లో తీసుకొచ్చిన సంస్కరణల కంటే ప్రస్తుతం కొన్ని రోజులుగా వ్యవహారిస్తున్న తీరే ఇబ్బందిగా మారిందని ఆ శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఎవరైనా ఆ శాఖ ఉద్యోగులు ఆ ఐఏఎస్‌ను ఏదైనా అడగాలంటే ఆ శాఖ ఉద్యోగులకు షోకాజ్ మెమోలతో పాటు తిట్ల పురాణంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో ఈ శాఖలో పనిచేసిన కొందరు ఐఏఎస్‌లు తమ శాఖ పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం అంతకంతకు పెంచారని ఈ ఐఏఎస్ బాధ్యతలు చేపట్టిన తరువాత హంగు, ఆర్భాటాలు తప్ప ఏమీ లేదని వారు పేర్కొనడం విశేషం.