కవిత ధైర్యంగా ఉన్నారు…ఫాసిస్టు విధానాలపై
పోరాటం కొనసాగిద్దామని అన్నారు
ఢిల్లీ లిక్కర్ కేసులో పిఎంఎల్‌ఎ వర్తించబోదు
పాలసీ అమల్లో పాల్గొన్న వారంతా
నేరస్తులే అయితే కేంద్రం కూడా నేరం చేసినట్లే
ఇలాంటి కేసులకు అదిరేది బెదిరేది లేదు
బిఆర్‌ఎస్ పార్టీని బెదిరించాలనుకుంటే
అది బిజెపి భ్రమనే అవుతుంది
ఎంఎల్‌సి కవితతో ములాఖాత్ అనంతరం బిఆర్‌ఎస్ నాయకులు
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ వ్యాఖ్యలు
కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఎంఎల్‌సి కవితపై కేసు పెట్టారని బిఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. న్యాయవాదికి నోటీసులు ఇవ్వకుండానే జైలులో ఉన్న కవితను సిబిఐ అరెస్టు చేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో బెయిల్‌పై విచారణ జరుగుతుండగానే రాత్రికి రాత్రికి జడ్జిని మార్చారంటే ఏ విధంగా వేధించాలని ప్రయత్నిస్తున్నారో ప్రజలు ఆలోచించాలన్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని తిహార్‌లో ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితతో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ ములాఖత్ అయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైన, దేశమైన ఆదాయాన్ని పెంచుకోవడానకి రకరకాల పాలసీలు చేస్తుంటాయని, ఆ క్రమంలో ఆదాయం పెంచుకోవడం కోసం ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొచ్చిందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆ పాలసీల అమలులో పాల్గొన్న ప్రతి ఒక్కరు నేరస్తులయితే కేంద్ర ప్రభుత్వం కూడా నేరం చేసినట్లు అవుతుంది కదా..? అని అడిగారు. కేంద్రం రైతులకు సంబంధించి మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చిందని, ఆరు నెలల తర్వాత ఉపసంహరించుకుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి ప్రయోజనాల కోసం ఆ చట్టాలను తీసుకొచ్చారు..?, మోదీని అరెస్టు చేయాలి కదా..? అని ప్రశ్నించారు.
బిజెపి రాజకీయ ప్రత్యర్థులను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నది
నిర్దోషిగా నిందితులే నిరూపించుకోవాలని, అంత వరకు జైలులో పెట్టవచ్చన్న పిఎంఎల్‌ఎ చట్టంలో సెక్షన్ 50లో ఉన్న చిన్న నిబంధను అడ్డంపెట్టుకొని బిజెపి రాజకీయ ప్రత్యర్థులను గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు. టెర్రసిస్టులకు ఆర్థిక వనరులు చేరడం, డ్రగ్స్ రవాణాకు నిధుల వినయోగం, దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలించే చర్యలకు పిఎంఎల్‌ఎ చట్టం వర్తిస్తుందని అన్నారు. ఈ కేసులో ఎక్కడా డబ్బు దొరకలేదని గుర్తు చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న రూ. 100 కోట్లు ఎక్కడ..? అని అడిగారు. డబ్బు స్వాధీనం చేసుకోకుండా వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అలాంటప్పుడు కేసుకు పిఎంఎల్‌ఎ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. లంచం డిమాండ్ చేసినట్లు కూడా ఈ కేసులో లేనప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తింపజేశారని అడిగారు. సహనిందితుల నుంచి, అప్రూవర్ల నుంచి బలవంతంగా వాంగ్మూళాలను తీసుకొని కవితను నిందితులుగా చేశారని ఆరోపించారు.
అన్ని వ్యవస్థలను తన నియంత్రణలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని అన్నారు. కేసులో ఇతరులను ఇరికించడానికి వాళ్ల పేర్లను చెప్పాలని, వీళ్ల పేర్లను చెప్పాలని దర్యాప్తు సంస్థలు ఒత్తిడి చేసినట్లు కవిత తమకు చెప్పారని వెల్లడించారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఛగన్ భుజబల్, ప్రఫుల్ పటేల్ వంటి వారిపై ఉన్న కేసులు ఎందుకు ముందుకు సాగలేదని ప్రశ్నించారు. బిజెపిలో చేరిన వారి కేసులు ముందుకు సాగబోవడం లేదని, బిజెపి అడుగులకు మడుగులు ఒత్తని వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం కోర్టులను కూడా భయపెట్టిస్తున్నదని ఆరోపించారు.
కేసులతో బెదిరిస్తారనుకుంటే అది బిజెపి భ్రమనే అవుతుంది : బాల్క సుమన్
కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులను ఇలాంటి కేసులతో బెదిరిస్తారనుకుంటే అది బిజెపి భ్రమనే అవుతుందని మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఎంఎల్‌సి కవిత ధైర్యంగా ఉన్నారని, ఇలాంటి కేసులను అదిరేది, బెదిరేది లేదని తేల్చిచెప్పారని అన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై, ఫాసిస్టు విధానాలపై ఇంకా గట్టిగా పోరాడుదామని కవిత అన్నారని చెప్పారు. న్యాయపరంగా కేసులను ఎదర్కొంటామని ప్రకటించారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించామని, తప్పకుండా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఫాసిస్టు, దుర్మార్గమైన ప్రభుత్వం ఉందని, దళితులు, రైతులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళల సంక్షేమం, అభివృద్ధి గురించి మాట్లాడని బిజెపి పార్టీ… ప్రతిపక్ష నాయకులపై సిబిఐ, ఇడి దాడులతో భయపెట్టి లొంగదీసుకొని నయా నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి దెబ్బతింటుందని, ఈ ఎన్నికల్లో బిజెపికి 200 నుంచి -220 సీట్లు మించబోవని, రాబోయేది సంకీర్ణ యుగమని అన్నారు. ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కి, కేసులు పెట్టి రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని బిజెపి భావించిందని, అదే వాళ్లకు నష్టం జగరబోతుందని పేర్కొన్నారు. కేసులను ఎదర్కొంటూ, ఎంతటి నిర్భందాన్ని అయినా భరిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల కోసం నిబలడుతుందని తెలిపారు.