గత ప్రభుత్వం చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లే..
మా హయాంలో రూ. 20,616,89 కోట్లు మాఫీ చేశాం..
ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్
శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కెసీఆర్.. నాలుగేళ్లల్లో చేసిన మాఫీ రూ.16,143 కోట్లు మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. వడ్డీ పోగా వీళ్లు మొదటి ఐదేళ్లల్లో చేసిన రుణమాఫీ 13,514 కోట్లు మాత్రమేనని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. రెండోసారి అధికారంలోకి వొచ్చాక నాలుగేళ్లు రైతుల రుణమాఫీకి రూపాయి కూడా ఇవ్వలేదు. చివరి ఏడాదిలో 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లు మాత్రమే.. వీళ్లు ఇప్పుడు మమ్మల్ని రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నారు. 10 నెలల్లో మేం 25,35,964 మంది రైతులకు రూ. 20,616,89 కోట్లు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పదేళ్లలో మీరు చేసింది ఎంత? పది నెలల్లో మేం చేసింది ఎంత? చూడండి. ప్రజలు ఉరి తీసినా మీ ఆలోచనా విధానంలో మార్పు రాలేదు.వాళ్లు ఎగ్గొట్టిన రైతు బంధు రూ.7,625 కోట్లు చెల్లించాం. రూ.4666.59 కోట్లు రెండో విడత రైతు భరోసా అందించాం. రైతు భరోసాను రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచాం. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లు ఫామ్ హౌస్ లో పండిన వడ్లను క్వింటాల్ రూ.4500 చొప్పున కావేరి సీడ్స్ కు అమ్ముకున్నారు.
కానీ మేం రూ.11 వేల 61 కోట్లు సన్న వడ్లకు బోనస్ ఇచ్చాం. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్. 29,14,692 మంది రైతులకు రూ.15,332 కోట్లు వెచ్చించాంరైతు బీమాను కొనసాగించాం. మీరు పదేళ్లు చేయలేనివి మేం పదినెలల్లో చేస్తే అభినందించాల్సింది పోయి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. నన్ను అభినందించకపోయినా ఫరవాలేదు… ప్రభుత్వాన్ని అభినందించవచ్చు కదా అని రేవంత్ రెడ్డి అన్నారు. 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 2014 నాటికి మొత్తం అప్పు రూ.90,160 కోట్లు. పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అప్పు 1.12.2023 నాటికి రూ. 6,69,257 కోట్లు. ఇది కాకుండా 40 వేల 154 కోట్లు పేమెంట్స్ పెండింగ్ లో పెట్టారు.
ఇవి కలిపితే వాళ్లు పదేళ్లలో చేసిన మొత్తం అప్పు రూ. 8,19,151 కోట్లు. ఇక వాళ్లు సాధించిన ఘనత ఏమిటో వాళ్లే చెప్పాలి. పదేళ్లలో ఒక పార్టీ, ఒక కుటుంబం చేసిన అప్పు ఏడున్నర లక్షల కోట్లు. మేం వొచ్చిన పదిహేను నెలల్లో చేసిన రూ.1,58,041 కోట్లు. ఇందులో డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన అసలు మొత్తం రూ. 88,591 కోట్లు. డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన వడ్డీ మొత్తం రూ. 64,768 కోట్లు. పదేళ్లలో వాళ్లు చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి మేం తిరిగి చెల్లించిన మొత్తం రూ. 1,53,359 కోట్లు. వాళ్లు చేసిన అప్పులకు చెల్లించినవి పోగా… 15 నెలల్లో మా ప్రభుత్వం చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.