Wednesday, March 19, 2025

దళితుల దశాబ్దాల కల నెరవేరుతోంది..

•సుప్రీం తీర్పు ఇచ్చిన ఆర్నెల్లలోనే వర్గీకరణ చట్టం
•ఇది కాంగ్రెస్‌ ‌పార్టీ కమిట్‌మెంట్‌ ‌కు నిదర్శనం
•ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహ

దళితుల దశాబ్దాల వర్గీకరణ కల నెరవేరబోతోందని  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు సీఎం రేవంత్‌ ‌రెడ్డి దార్శనికతకు తార్కాణమని కొనియాడారు. మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ ఈనాటి కాదు, స్వాతంత్య్రం వొచ్చిన 15 ఏండ్లకే ఈ డిమాండ్‌ ‌మొదలైంది. వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది త్యాగాలు చేశారు.  వారందరికీ మాదిగ సమాజం తరపున కృతజ్ఞతలు.  అమ రుల ఆశయాలను, దశా బ్దాల మాదిగల ఆకాంక్షను సీఎం రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారు.

వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 6 నెలల్లోనే వర్గీకరణ చట్టం చేసుకుంటున్నాం. ఇది కాంగ్రెస్‌ ‌పార్టీ కమిట్‌మెంట్‌, ‌రేవంత్‌రెడ్డి కమిట్‌మెంట్‌. 2025 ‌ఫిబ్రవరి 4వ తేదీ(సోషల్‌ ‌జస్టీస్‌ ‌డే), మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయి.  గతంలో ఓసారి వర్గీకరణ చేసినా, కోర్టు తీర్పులతో అది నిలిచిపోయింది.  కేవలం 1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయి. మొత్తం మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమే కావడం గమనార్హం.మిగిలిన 33 కులాలూ, పాత గ్రూపుల ప్రకారమే కొనసాగుతున్నాయి.  ప్రపంచంలో అనేక దేశాల్లో వర్ణ వివక్ష, బానిసత్వం ఉంటే, మన దేశంలో అత్యంత నీచమైన అంటరానితనం ప్రజలను పీడించింది.

మహనీయుడు అంబేడ్కర్‌ ‌పోరాట ఫలితంగా దళితులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కానీ, ఆ రిజర్వేషన్ల ఫలాలు షెడ్యూల్డ్ ‌కులాల ప్రజలందరికీ వారి వారి జనాభా ప్రాతిపదికన పంపిణీ కాలేదు.  ఇదే దళిత సమాజంలో ఆందోళనకు, అసంతృప్తికి కారణమైంది.  స్వాతంత్య్రం వొచ్చిన 15 ఏండ్లకే, 1965లోనే ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు బీఎన్‌ ‌లోకూర్‌ ‌కమిటీని అప్పటి ప్రభుత్వం నియమించింది.  ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరాన్ని నాడే ఆ కమిటీ గుర్తించింది.  మా వాటా మాకు, మా హక్కులు మాకు కావాలని ప్రజలు ఆందోళన చేయడంతో 1975లోనే పంజాబ్‌ ‌ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది. 1990వ దశకం నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉదృతమైంది.

ఫలితంగా నాటి ప్రభుత్వం జస్టీస్‌ ‌రామచంద్రరాజు నేతృత్వంలో 1996లో కమిషన్‌ను ఏర్పాటు చేసింది.  వెనుకబాటుతనం, జనాభా, చారిత్రక నేపథ్యం ఆధారంగా షెడ్యూల్డ్ ‌కులాలను 4 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్‌ ‌సూచించింది. కమిషన్‌ ‌సూచనల మేరకు 2000లో షెడ్యూల్డ్ ‌కులాలను ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేశారు. అత్యంత వెనుకబడిన రెల్లి, దాని ఉపకులాలను గ్రూప్‌ ఏలో చేర్చి, వారికి కమిషన్‌ ‌సూచనల ప్రకారం అదనపు ప్రయోజనం కల్పించారు. వారి జనాభా ప్రకారం 0.25 శాతం రిజర్వేషన్‌ ‌రావాల్సి ఉండగా, 1 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించారు. దీన్నే ప్రిఫరెన్షియల్‌ ‌ట్రీట్‌మెంట్‌ అన్నారు.  కోర్టు కేసులు, సుప్రీంకోర్టు తీర్పుతో 2004 నుంచి వర్గీకరణ ఆగిపోయింది.  2006లో దవిందర్‌ ‌సింగ్‌ ‌వర్సెస్‌ ‌పంజాబ్‌, ‌కేసుతో పంజాబ్‌లోనూ వర్గీకరణ ఆగిపోయింది.

నాటి నుంచి గతేడాది వరకూ వర్గీకరణ కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది.  సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ కేసులో, వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు ప్రభుత్వం తరపున సీనియర్‌ అడ్వకేట్‌ను నియమించాం. సుదీర్ఘ విచారణ, వాదోపవాదనల అనంతరం గతేడాది ఆగస్ట్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తుది తీర్పును ప్రకటించింది.  రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చునని పేర్కొంది. వర్గీకరణకు ఎంపిరికల్‌ ‌డేటాను ప్రమాణికంగా తీసుకోవాలని చెప్పింది.  ‘‘వర్గీకరణ లేకుండా, షెడ్యూల్డ్ ‌కులాలలోని అత్యంత అణగారిన వర్గాలు రిజర్వేషన్లలో వారి చట్టబద్ధమైన వాటాను పొందలేరు’’ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.  ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ ‌కులాలను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడానికి, చట్టాలను రూపొందించడానికి ఆర్టికల్‌ 341 అడ్డురాదు.’’అని స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతో కాకుండా, అందరికీ న్యాయం జరిగేలా వర్గీకరణ చేయాలని సూచించింది. ఇందుకోసం అక్షరాస్యత, వృత్తి, జనాభా, ఉద్యోగవకాశాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులను ప్రమాణికంగా తీసుకోవాలని ఆదేశించింది.

దీన్నే సుప్రీంకోర్టు ఎంపిరికల్‌ ‌డేటాగా వర్ణించింది. ఎంపిరికల్‌ ‌డేటా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వొచ్చిన గంటలోపే, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు. హైకోర్టు రిటైర్డ్ ‌జడ్జితో వన్‌ ‌మ్యాన్‌ ‌కమిషన్‌ ఏర్పాటు చేసి, అధ్యయనం చేయించాలని సూచించింది. రిటైర్డ్ ‌జడ్జి, జస్టీస్‌ ‌షమీమ్‌ అక్తర్‌ ‌చైర్మన్‌గా వన్‌ ‌మ్యాన్‌ ‌జ్యుడీషియల్‌ ‌కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని పాత పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను కమిషన్‌ ‌తెలుసుకున్నది. ప్రజల నుండి మొత్తం 8 వేలకుపైగా విజ్ఞాపనలను కమిషన్‌ ‌స్వీకరించింది. ఎస్సీల జనాభా, అక్షరాస్యత, ఉపాధి,విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక స్థితిగతులు మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.  82 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, 199 పేజీల నివేదికను ఫిబ్రవరి 3, 2025 న ప్రభుత్వానికి సమర్పించింది అని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com