నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం.. వాటికి నిధులు మాత్రం కేటాయించలేదు. అంతేకాకుండా.. ఉద్యోగవర్గాల కోసం పాత పద్దులో కోత పెట్టారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ హామీ.. బడ్జెట్ లో పైసా కేటాయించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీతో చెప్పించి యువతను నమ్మించారు. జాబ్ క్యాలెండర్ లోనూ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
తీరా బడ్జెట్ కేటాయింపులు చూస్తే కొత్త కొలువుల భర్తీకి పైసా కేటాయించలేదు. అసెంబ్లీ ప్రస్తుత సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు 2 లక్షల ఉద్యోగాలు కాకున్నా 30 నుంచి 40 వేల ఉద్యోగాలైనా మొదటి ఏడాదిలో రేవంత్ సర్కారు భర్తీ చేస్తుందేమోనని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలను సర్కారు ఆవిరి చేసింది.
ఒకవేళ జాబ్ క్యాలెండర్ ప్రకటించినా, అందులోంచి ఒకటో, రెండో నోటిఫికేషన్ లు ఇచ్చినా ఉద్యోగాలు సాధించిన వారికి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, పోస్టింగ్ లు ఇచ్చే ముచ్చట్నే లేదు. శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపుల్లో ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు, ప్రభుత్వ నిర్వహణ, ఇతర ఖర్చులకు కోసం ఆర్థిక శాఖకు 2024 -25 బడ్జెట్ లో కేవలం రూ.47,713 కోట్లు కేటాయించారు. నిరుటి బడ్జెట్ సవరించిన అంచనాలతో పోల్చితే కేటాయింపుల్లోనే రూ.6,418 కోట్లు కోత పెట్టారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నా అవి గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి, రిజల్ట్స్ ప్రకటించినవే. ఆ ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేసే మొత్తాన్ని గత బడ్జెట్ లోనే కేటాయించారు. ప్రస్తుత బడ్జెట్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి మాత్రమే కాదు.. పీఆర్సీ సిఫార్సుల మేరకు ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు పెంచేందుకు అదనంగా కేటాయింపులు లేవు. అంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు ఇప్పటికిప్పుడు లాభం పొందిందైతే ఏమీ లేదు.