- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- మేడ్చల్, శంకర్‌పల్లి జోన్‌లు రెండుగా విభజన
హెచ్‌ఎండిఏలో మరో రెండు జోన్లను అదనంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా హెచ్‌ఎండిఏకు అనుమతుల కోసం భారీగా దరఖాస్తులు వస్తుండడంతో నాలుగు జోన్‌లను కాస్త ఆరు జోన్లుగా మారుస్తూ హెచ్‌ఎండిఏ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు జోన్లను అదనంగా ఏర్పాటు చేయడం వల్ల వేగంగా అనుమతులు ఇవ్వొచ్చని, అధికారులకు పనిభారం తగ్గుతుందని హెచ్‌ఎండిఏ భావిస్తోంది. చాలా రోజుల నుంచి జోన్ల పెంపు ప్రతిపాదనలు హెచ్‌ఎండిఏ అధికారులు తెరపైకి తీసుకొచ్చినా ప్రస్తుతం ఆ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ దానికి ఆమోదముద్ర వేయడం విశేషం. ప్రస్తుతం హెచ్‌ఎండిఏ పరిధిలో నాలుగు జోన్లు ఉన్నాయి. అందులో మేడ్చల్, ఘట్‌కేసర్, శంకర్‌పల్లి, శంషాబాద్‌లు ఉండేవి.
ప్రస్తుతం అందులో నుంచి మేడ్చల్‌ను రెండు జోన్లుగా శంకర్‌పల్లిని రెండు జోన్లుగా విభజించడంతో మొత్తం ఆరు జోన్లు అయ్యాయి. ప్రస్తుతం మేడ్చల్ 1, మేడ్చల్ 2, శంకర్‌పల్లి 1, శంకర్‌పల్లి 2తో పాటు ఘట్‌కేసర్, శంషాబాద్‌లు జోన్లుగా ఏర్పడ్డాయి. దీంతోపాటు కొత్త జోన్‌లకు పిఓలను నియమించడంతో పాటు పాత జోన్‌లలో పనిచేసే పిఓలను కూడా వేరే చోటుకు బదిలీ చేశారు. పలువురు పిఓలపై అవినీతి ఆరోపణలు రావడం, చాలాఏళ్లుగా ఈ జోన్‌లలోనే వారి పనిచేస్తుండడంతో వారిపై బదిలీ వేటు పడినట్టుగా తెలిసింది. హెచ్‌ఎండిఏ ఏడు జిల్లాలతో 7,282 కి.మీ. పరిధిలో విస్తరించి వుంది. దీంతో లేఔట్ అనుమతులు, నిర్మాణ అనుమతులను మరింత వేగవంతంగా మంజూరు చేసేందుకే ఈ జోన్‌ల సంఖ్యను పెంచినట్టు అధికారులు తెలిపారు.