ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ ప్రమాదం దురదృష్టకరం
ఆ ఎనిమిది మందిని కాపాడేందుకు భారత సైన్యం సహకారం
ఈ రాత్రికి ఘటనా స్థలికి ఆర్మీ రెస్క్యూ టీం
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ లో ఈ తరహా సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్.ఎల్.బి.సి టన్నెల్ తవ్వకాల్లో ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకుని హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించడం తో పాటు లోపల చిక్కుకున్న వారిని కాపాడడం కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు దోమలపెంటలోని జేపి గెస్ట్ హౌస్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి తెలంగాణ అగ్నిమాపక, రెస్క్యూ టీం డి.జి నారాయణ రావు, ఐజి సత్యనారాయణ నాగర్ కర్నూల్ కలెక్టర్ తో పాటు రాబిన్ సంస్థ కు చెందిన లెన్ మైనార్డ్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సొరంగంలో చిక్కుకున్న మిగిలిన ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డి పని చేస్తుందన్నారు.
అందు కోసం ఇప్పటికే సింగరేణి కి చెందిన రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయని, భారత ఆర్మీకి చెందిన రెస్క్యూ టీంలతో తాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడామని ఈ రాత్రి వరకు ఆ టీం ఇక్కడికి చేరుకుంటుందని ఆయన వెల్లడించారు. అంతే గాకుండా టన్నెల్ వద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు రంగంలోకి దిగి కాపాడే టీంలతో కూడా మాట్లాడినట్లు ఆయన తెలిపారు.ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నప్పుడు రంగంలోకి దిగి ప్రాణాపాయం లేకుండా కాపాడిన టీంను కూడా రంగంలోకి దింపనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లతో పాటు ఉన్నత స్థాయి ప్రభుత్వ యంత్రాంగం ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు గాను ఎప్పటికప్పుడు సమాలోచనలు చేస్తూ సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. అగ్నిమాపక డి.జి నారాయణ రావు ఆధ్వర్యంలో రెస్క్యూ టీం పనిచేస్తుండగా ఐ. జి సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ బృందాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయన్నారు. ఇప్పటికే వైద్య బృందం అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచామన్నారు. నీటిపారుదల శాఖాధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారిని కాపాడేందుకు చేపడుతున్న చర్యలను పర్యవేక్షిస్తున్నామన్నారు.
అయితే వెంటిలేషన్ కు ఇబ్బంది లేదన్నారు. టన్నెల్ తవ్వకంలో రాబిన్ సంస్థ ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్నదన్నారు. లోపల చిక్కుకున్న ఆ ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడడమే ప్రభుత్వం ముందున్న సవాల్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిలో ప్రాజెక్ట్ ఇంజనీర్,సైట్ ఇంజినీర్ తో పాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు వర్కర్లు ఉన్నారని ఆయన వివరించారు.
టన్నెల్‌లో చిక్కుకున్నవారి వివరాలు..
1..మనోజ్ కుమార్ (పీఈ) ఉత్తర ప్రదేశ్
2.. శ్రీనివాస్ (ఎఫ్‌ఈ) ఉత్తర ప్రదేశ్
3.. సందీప్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
4.. జటాక్స్ (కార్మికుడు)జార్ఖండ్
5..సంతోష్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
6.. అనూజ్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
7..సన్నీ సింగ్ (కార్మికుడు)జమ్మూ కాశ్మీర్
8.. గురుప్రీత్ సింగ్ (కార్మికుడు) పంజాబ్
టన్నెల్ తవ్వకాలు మొదలు పెట్టిన ఏజెన్సీ నిర్వాహకులు చెప్పే కథనం ప్రకారం అకస్మాత్తుగా లోపటికి నీరు, మట్టి 8 కిలోమీటర్ల మేర రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారని తెలిపారు. రోజువారీగా పని మొదలు పెట్టినట్లే ఈ ఉదయం 8 గంటలకు పని మొదలు పెట్టిన 30 నిమిషాల్లోనే ఈ సంఘటన ఉత్పన్నమవడంతో వెంటనే నిర్వాహకులు పనిని నిలిపి వేసి బయటకు రావడంతో పాటు వీలున్నంత వరకు సిబ్బందిని బయటకు తీసుకొచ్చారన్నారు. టన్నెల్ బోర్ మిషన్ టిబిఎం, వద్ద పని మొదలు పెట్టిన చోటకు నీరు, మట్టి చేరుతుండడంతో పాటు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో మిషన్ మీద ఉన్న వారు,వెనుక భాగంలో ఉన్న వారు బయటకు రాగలిగారని మిషన్ ముందు భాగంలో ఉన్న వారు అందులో చిక్కుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.