ధరణి స్థానంలో వొచ్చిన నూతన పోర్టల్
చిక్కులు లేకుండా రూపకల్పన
సందేహాల పరిష్కారానికి భూమిత్ర చాట్‌బాట్
తెలంగాణ కొత్త భూచట్టం రాబోతుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ‘భూ భారతి చట్టాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే శాసనసభ ఆమోదముద్ర వేయగా… గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ నూతన చట్టాన్ని…. ఏప్రిల్ 14వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో కీలక మార్పులు ఉండనున్నాయి.
అందుబాటులోకి భూ భారతి పోర్టల్…
ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులు మీదుగా కొత్త చట్టంతో పాటు భూ భారతి పోర్టల్‌ను కూడా ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఫలితంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ధరణి’ స్థానంలో భూ-భారతి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఆ తేదీ తర్వాత.. భూ భారతి పోర్టల్ ద్వారానే క్రయవిక్రయాలు జరుగుతాయి.
గందరగోళానికి తావు లేకుండా మార్పులు
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల పోర్టల్ ధరణి స్థానంలో భూ-భారతి పోర్టల్‌నూ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. పాత దానిలో 33 మాడ్యూళ్లు ఉన్నాయి. రైతులు పోర్టల్లో దరఖాస్తు చేసే సమయంలో ఒకదానికి బదులు మరొక మాడ్యూల్‌ను ఎంపికచేస్తే తిరస్కారానికి గురికావడమో, లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది. ఈ గందరగోళానికి ముగింపు పలికేలా కొత్త పోర్టల్‌లో మాడ్యూళ్ల సంఖ్యను ఆరుకు కుదించారు. వారసత్వ బదిలీ సమయంలో కుటుంబ సభ్యులందరికీ తెలిసేలా నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా అందులో ఉంది. దీంతోపాటు ఈ-పహాణీని 11 కాలమ్‌లతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహాణీ ఉండేది. దాని స్థానంలో యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నంబరు, అనుభవదారు లేదా పట్టాదారు, ప్రభుత్వ భూమి లేదా పట్టా భూమి, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా తదితర వివరాలు తెలిపేలా పహాణీ ఉండనుంది.
ఈ ఏడాది జనవరి 9న ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ యాక్ట్(ఆర్ వోఆర్ )-2025 భూ భారతి’ చట్టం రూపం దాల్చింది. ఈ కొత్త చట్టాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే దిశగా కసరత్తు చేస్తూ వచ్చింది. క్షేత్రస్థాయిలోని అధికారి నుంచి పైస్థాయిలోని ఉన్నతాధికారి వరకు చట్టం అమలుపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. అందించాల్సిన సేవలు, ఎదురయ్యే సమస్యలపై లోతుగా చర్చించింది. వీటన్నింటి తర్వాతే…. ఈ కొత్త రెవెన్యూ చట్టాన్ని ఏప్రిల్ 14 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. భూ-భారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలను చూసుకునేలా డిస్‌ప్లే చేస్తారు. ప్రతి భూకమతానికి భూ ఆధార్ ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఈ చట్టం ప్రకారం… గ్రామకంఠం, ఆబాదీలపై కూడా హక్కులను కట్టబెట్టనున్నారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో రెండెంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 11 కాలమ్‌లతో కొత్త పహాణీని ఏర్పాటు చేయనున్నారు.
భూ భారతి పోర్టల్ లోగోను రెవెన్యూశాఖ దాదాపు కొలిక్కి తీసుకొచ్చింది. వృత్తంలో తెలంగాణ అధికారిక చిహ్నాలు, లోపల సాగును ప్రతిబింబించేలా ఆకుపచ్చని రంగుతో లోగో ఉండనుందని తెలిసింది. వృత్తంపై భూముల నిర్వహణకు సంబంధించిన చట్టం వివరాలను పొందుపర్చినట్లు సమాచారం. కొత్త చట్టం, భూ-భారతి లోగోను ఖరారు చేసేందుకు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు, నిపుణులు సమావేశం కానున్నట్లు తెలిసింది.