- బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందే భూములను కబ్జా చేయడానికి
- ప్రభుత్వ భూములు,111, ఎఫ్‌టిల్, బఫర్‌జోన్ భూములను బిఆర్‌ఎస్ నాయకులు కబ్జా చేశారు
- టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావుల సహకారంతోనే యథేచ్ఛగా చెరువులు కబ్జాలకు గురయ్యాయని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందే భూములను కబ్జా చేయడానికి అని ఆయన మండిపడ్డారు.
పదేళ్లలో బిఆర్‌ఎస్ నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములు,111, ఎఫ్‌టిల్, బఫర్‌జోన్ భూములన్ని కబ్జా చేశారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు పట్టాలు మార్పించారని, దురాక్రమనకు గురైన ప్రభుత్వ భూములను ఇంచు వదలకుండా కాపాడడానికి సిఎం రేవంత్ రెడ్డి హైడ్రాతో ముందుకు పోతున్నారని, ఈరోజు హరీష్ రావు, కెటిఆర్‌లు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన అన్నారు.
హరీష్‌రావు ఎన్ కన్వెన్షన్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎన్ కన్వెన్షన్ అక్రమంగా కడితే హరీష్ రావు ఎన్ కన్వెన్షన్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. మీరు ఎందుకు కాళ్లు, చేతులు ముడుచుకు కూర్చున్నారని, పదేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు, కుంటలు ఆక్రమించుకున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు ఎంతమందో ఉన్నారని ఆయన ఆరోపించారు.
చట్టానికి చుట్టాలు లేరని, ఎవరైనా చూసేది లేదని, ఎంత పెద్ద వారైనా వదిలేదిలేదన్నారు. కాంగ్రెస్ నాయకులవి కూడా కూలగోడుతున్నారని, దూరదృష్టితోనే దురాక్రమనకు గురైన చెరువులు కుంటలను కాపాడడానికి సిఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి, హైడ్రా అధికారులకు మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపారు.