మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు..
విద్వేష రాజకీయాలకు ప్రేమతోనే మా సమాధానం
రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి
అప్పుడే దేశ ప్రగతి ముందుకు సాగుతుంది
భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ
రాహుల్‌కు ఘనంగా స్వాగతం పలికిన సిఎం, తదితరులు
విద్వేష రాజకీయాలకు ప్రేమే మా సమాధానమని రాహుల్ అన్నారు. హిందీలో ఓ స్లోగన్ తీసుకున్నాం.. విద్వేషం అనే బజార్ లో ప్రేమ అనే దుకాణం తెరిచా (నఫ్రత్ కే బజార్ మే.. మే.. మహబత్ కే దుకాణ్) అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో కొనసాగుతున్న భారత్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని ఆకాంక్షించారు. అప్పుడే కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చి, దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రాహుల్ మాట్లాడుతూ.. ’ ప్రపంచ వ్యాప్తంగా రాజకీయాలు ఎంతో మారిపోయాయి. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. విపక్షాలను అణగదొక్కడమే అధికార పార్టీకి పనైపోయింది. మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు’ అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎన్నికలకు ముందు కన్యాకుమారి నుంచి సుమారు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు రాహుల్ గుర్తు చేసుకున్నారు.
పాదయాత్రకు ముందు చాలా ఆలోచించానని, అయితే, మొదలు పెట్టిన తర్వాత వెనకడుగు వేయలేదని అన్నారు. ఆ తర్వాత చాలా మంది తనతో కలిసి నడవడం మొదలుపెట్టినట్లు చెప్పారు. భారత్ సమ్మిట్-2025కు నిన్ననే రావాల్సి ఉండేదని, కానీ, కాశ్మీర్ కి వెళ్లాను.. క్షమించండి.. ఈ సమ్మిట్ నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ఇక, రాజకీయాల్లో కొత్త జనరేషన్ రావాలి.. ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా మారిపోయాయి.. పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు అని ఆయన తెలిపారు. ఇక, భారత్ జోడో యాత్రలో 4 వేల కిలోటర్లు నడిచా.. కన్యాకుమారి నుండి పాదయాత్ర మొదలు పెట్టా.. 10 రోజుల తర్వాత చూస్తే నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది.. ఈ యాత్రలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.. సగం దూరం నడిచేటప్పటికి నేను గతంలో లాగా లేను.. ప్రజలతో ఎలా మాట్లాడాలో.. వారి సమస్యలు ఎలా వినాలో నేర్చుకున్నా.. నేను గతంలో ఎప్పుడూ ప్రజలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచలేదు అని రాహుల్ గాంధీ వెల్లడించారు.
కానీ, ఈ పాదయాత్రలో నేను ప్రజలపై నా ప్రేమను వ్యక్త పరచగలిగాను అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడైతే ప్రజలపై నా ప్రేమను వ్యక్తపరిచానో అప్పటినుంచి అందరూ స్పందిస్తున్నారని తెలిపారు. యాత్రలో కొన్ని సార్లు స్టక్ అయ్యాను.. అప్పటి నుంచి నన్ను చాలా మంది ఇష్టపడటం మొదలు పెట్టారు.. ఓ చిన్న అమ్మాయి వొచ్చి లవ్ యూ అని చెప్పింది.. ఆ తర్వాత నేను కూడా నా ఇష్టాన్ని ఎక్స్ ప్రెస్ చేస్తూ వొచ్చాను అన్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 100 దేశాలకు చెందిన 450 మంది ప్రముఖులు పాల్గొన్నారు. సమ్మిట్ చివరి రోజున ఈ గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అంతకు ముందు విమానాశ్రయంలో ఆయనకు సిఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు స్వాగతం పలికారు.