పీకల్లోతు నష్టాల నుంచి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ నిజామాబాద్ రీజియన్ లో 13 ఎలక్ట్రిక్ బస్సులను శుక్రవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ధనుపాల్ సూర్య నారాయణ, భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, మేయర్, ఆర్టీసి ఉన్నతాధికారులతో కలిసి మంత్రి పొన్నం బస్సులో ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసి గత 10 సంవత్సరాలుగా ఒక్క బస్సు కొనకుండా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఒక రిటైర్డ్ ఈడీని పెట్టి ఆర్టీసి ఉనికికే ప్రమాదం తెచ్చారని విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం మమాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఈరోజు వరకు ఆర్టీసీలో 94 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. రూ.3500 కోట్ల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారని చెప్పారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల రూపంలోకి తీసుకొచ్చి పీఆర్సీ బకాయిలు తీర్చిందన్నారు.
మహాలక్ష్మి పథకం విజయవంతమైందని, దీని వెనుక ఆర్టీసి ఉద్యోగులు నిరంతరం శ్రమ ఉందని మంత్రి పొన్నం కొనియాడారు. రాఖి పౌర్ణమి రోజు గతంలో ఎప్పుడు లేని విధంగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని తెలిపారు. నిజామాబాద్‌లో 67 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించామని, ఈరోజు13 బస్సులు ప్రారంభి ంచామని వారం రోజుల్లో మిగిలిన బస్సులను తీసుకు వస్తామని చెప్పారు. కారుణ్య నియామకాలు చేపట్టి ఆర్టీసీని ముందుకు తీసుకుపోతున్నామని, ఆర్టీసికి ప్రజల సహకారం ఎంతో ఉందని తెలిపారు.