- ఈవిఎం బాక్స్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లపై నిఘా ఉంచాలి
- నాయకులు, కార్యకర్తలకు టిపిసిసి హెచ్చరిక
రానున్న 20 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలను టిపిసిసి హెచ్చరించింది. ఈవిఎం బాక్స్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లపై నిఘా ఉంచాలని సూచించింది. ఈ మేరకు టిపిసిసి వార్‌రూం నుంచి నాయకులు, కార్యకర్తలను పలు సలహాలు, సూచనలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు, ఇన్‌చార్జీలు నిత్యం మానిటరింగ్ చేయాలని పేర్కొంది. ప్రతి రోజు విజిట్ చేయాలని ఆదేశాలిచ్చింది. స్ట్రాంగ్ రూమ్‌ల బయట కూడా పార్టీ కీలక నేతలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
మూడు షిప్టుల్లో నాయకులు, కార్యకర్తలు వీటిని గమనించాల్సిన అవసరం ఉందని టిపిసిసి వివరించింది. ఎన్నికలు పూర్తయ్యాయన్న నిర్లక్ష్యంతో ఉండకుండా ఈవిఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌లపై ఫోకస్ పెట్టాలని పార్టీ పేర్కొంది.పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ, పార్టీ నేతలు కూడా స్ట్రాంగ్‌రూంలను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని పార్టీ గుర్తు చేసింది.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద అనుమానితులు కనిపిస్తే వెంటనే అధికారులు, ఈసీకి ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. ఇందుకోసం టిపిసిసి ఎన్నికల కో-ఆర్డినేటర్లతో సమన్వయం కావాలని సూచించింది. స్ట్రాంగ్‌రూమ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే తెలియజేయాలని టిపిసిసి ఆదేశాలిచ్చింది.