మెట్రో రైళ్లలో అమల్లో ఉన్న ‘సూపర్ సేవర్ హాలిడే కార్డు’ ఈనెలాఖరుతో ముగుస్తుంది. మెట్రో సూపర్ సేవర్ హాలిడే కార్డును 2022లో ప్రారంభించగా ఈ పథకానికి ప్రయాణికుల నుంచి భారీ స్పందన లభించింది. తరుచూ ఈ పథకాన్ని మెట్రో అధికారులు పొడిగిస్తున్నారు. గత మార్చి 31వ తేదీన ముగిసిపోగా అధికారుల విజ్ఞప్తి మేరకు మరో ఆరు నెలలు పొడిగించారు. ప్రస్తుతం ఈ నెలాఖరుతో ఈ పథకం ముగుస్తుండగా దీనిపై మెట్రో అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
సెలవు రోజుల్లో మెట్రోరైల్లో రూ.59లకే రోజంతా ప్రయాణించే సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హాలిడే కార్డు ఆదివారం, రెండో శనివారంతో పాటు ఇతర సెలవు రోజుల్లో అందుబాటులో ఉండేది. ఈసారి కూడా ఎల్ అండ్ టి మెట్రోరైలు సంస్థ ఈ సూపర్ సేవర్ హాలిడే కార్డును పొడిగిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరోసారి కూడా ఈ పథకాన్ని పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇటీవల మెట్రోలో ప్రయాణికుల సంఖ్య కోటిన్నరకు చేరింది. రెండు కోట్లకు చేరుకోవాలన్నది మెట్రో లక్ష్యం. దీనికోసం సూపర్ సేవర్ హాలిడే కార్డు ఆఫర్‌ను పొడిగించడంతో పాటు ఉద్యోగులకు, విద్యార్థులకు నెలవారీ పాసులు, సూపర్ ఆఫ్ పీక్ అవర్ ఆఫర్లను ఇవ్వాలని, అలాగే ప్రయాణికుల రద్దీ మేరకు బోగీల సంఖ్య పెంచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.