- పేదోడు అయితే చాలు…!
- కులం, మతం చూసి సంక్షేమ పథకం ఇవ్వం
- ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే
- ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం నిరంతర ప్రక్రియ
- రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- కూసుమంచిలో మోడల్ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
కులం లేదు… మతం లేదు… ఏ పార్టీ అని అడగం…. సంక్షేమ పథకమిస్తే వొచ్చేసారి మా పార్టీకి వోటు వేయాలనే నిబంధన పెట్టం…కేవలం పేదోడు అయితే చాలు.. ఇందిరమ్మ రాజ్యంలో అమలు చేసే ప్రతీ సంక్షేమ పథకానికి అర్హుడేనని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కూసుమంచిలోని మండల ఆఫీస్ కాంప్లెక్స్ లో నిర్మించిన నమూన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో ఈ ఆనందం ప్రతీరోజు ఇలానే ఉండేలా ఆ దేవుడు దీవించాలని కోరుతున్నట్లు తెలిపారు. 2004 నుంచి 2014 వరకు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఇళ్లు పేదలకు కట్టించి ఇచ్చిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదేనన్నారు.
ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు…. ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని ఒక సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరంలోకి వొచ్చామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో ప్రతీ తెలంగాణ బిడ్డకు తెలుసని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు పెద్దలు ఎలా కొల్లగొట్టారో తెలుసని అయినా కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఇచ్చిన ప్రతీ హామీని తెలంగాణ బిడ్డకు ఇస్తూ ఎక్కడా తెలంగాణలో పేదవాడు ఇబ్బంది పడొద్దు అని పేదవాడు కుటుంబం ఆనందంగా ఉండాలని తహతహలాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లమీద ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో చెప్పడానికి మొదటి విడతగా మొదటి సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల ఇల్లు రాష్ట్రవ్యాప్తంగా నిర్మించాలని ఒక దృఢ సంకల్పంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇస్తున్నామని తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యం ఉన్నంతవరకు సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. జనవరి 26 నుంచి పేదలు మెచ్చే మరో నాలుగు సంక్షేమ హామీలు అమలు కాబోతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నానని తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద వాడి కల నెరవేర్చడం కోసం అర్హులైన ప్రతీ పేదవాళ్ళకి ఈ ఇందిరమ్మ రాజ్యం రాబోయే నాలుగు సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు కట్టాలని చిత్తశుద్ధితో ఉన్నట్లు చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా పేదవాడి ముఖంలో ఆనందం చూడటం కోసం పేదవాడి కల నెరవేర్చడం కోసం పేదవాడు కూడా ఒక గూడుని ఏర్పాటు చేయడం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుందని హామీ ఇచ్చారు.
రియల్ ఎస్టేట్ కి మార్చిన భూములు తప్ప వ్యవసాయానికి యోగ్యమైన ఎన్ని ఎకరాలు ఉన్నా ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి 10000 ఇస్తే ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రూ.12 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అది పది లక్షలా, 15 లక్షల ఎన్ని లక్షలు అనేది కాదు ఎన్ని కార్డులు అయినా ఇస్తామని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ప్రతి సంవత్సరం 12వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రెండు విడుతలుగా శ్రీకారం చుట్టబోతున్నమన్నారు. అనంతరం కూసుమంచి మండలంలోని దుబ్బ తండాలో ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్, ఖమ్మం ఆర్డీవో, హౌసింగ్ ఈ ఈ, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.