అపార్ట్మెంట్లోని ఐదో ఫ్లోర్ నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు.
ప్రస్తుత రోజుల్లో ప్రతి సమస్యకు చనిపోవడం ఒక్కటే మార్గంగా ఆలోచించి నిండైనా జీవితాన్ని మధ్యలోనే తుంచుకుంటున్నారు. అసలు సమస్య ఎందుకు వచ్చింది? ఎలా పరిష్కరించుకోవాలనే ఆలోచన కూడా నేటితరం మనుషుల్లో కరవైంది. ఎవరైనా మోసం చేసినా, ఓ విషయంపై ఎవరేమన్నా కామెంట్ చేసినా, ఆరోగ్య, ఇంట్లో సమస్యలు ఉన్నా వెంటనే దీర్ఘంగా ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. ఆ వెంటనే ఆత్మహత్యనే ఉన్న ఏకైక మార్గంగా భావించి కుటుంబాలను, పిల్లలను వదిలేసి ఆ దారిలో వెళుతున్నారు.
ఈ మధ్యకాలంలో ఆత్మహత్య అనే ట్రెండ్ బాగా ఎక్కువైంది. కూర బాగోలేదని భర్త అన్నాడని భార్య ఆత్మహత్య, ప్రేమలో విఫలం చెందానని యువతీయువకులు రైళ్ల కిందపడి బలవన్మరణం, వాషింగ్ మిషన్ బాగుచేయించలేదనని ఫ్యాన్‌కు ఊరేసుకున్న భార్య, హాస్టల్లో ఉండలేనని విద్యార్థుల ఆత్మహత్య, ఉద్యోగం రాలేదని నిరుద్యోగుల ఆత్మహత్యలు వంటివి నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అలాంటి ఘటనే జరిగింది. వివరాలు తెలియకపోయిన అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె అక్కడికక్కడ ప్రాణాలు విడిచిపెట్టగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హరినగర్‌లో నివాసం ఉంటున్న ఓ మహిళ గిరి శిఖర అపార్ట్మెంట్లోని ఐదో అంతస్తు ఎక్కింది. అక్కడ గోడపైకి ఎక్కి కూర్చుంది. అక్కడ ఈ విషయాన్ని స్థానికులు గమనించి కేకలు వేశారు. వారు తెరుకునే లోపు హఠాత్తుగా ఒక్కసారిగా ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆమె వద్దకు వెళ్లారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మరణించినట్లు సమాచారం.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు : పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు.