Sunday, April 13, 2025

రాష్ట్రవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన వాహనాలు 31 లక్షల వాహనాలు

  • గ్రేటర్ పరిధిలో తుక్కుగా మారడానికి 21 లక్షల వాహనాలు సిద్ధం
  • 2025, జనవరి 1వ తేదీ నుంచి కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

కాలంచెల్లిన వాహనాల నిర్వహణ భారం పెరిగిపోతుంది. దీంతోపాటు వీటివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. కాలంచెల్లిన వాహనాలను వాడటం వల్ల ఇంధనం విపరీతంగా ఖర్చు కావడం, వాటివల్ల వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే 15 ఏళ్లు పైబడిన వాహనాలను తుక్కుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా తుక్కుగా మార్చుకున్న వాహనాలకు రాయితీని వర్తింపచేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే 2009కి ముందు కొనుగోలుచేసిన వాహనాలను తుక్కుకింద మార్చనుంది.

రవాణాశాఖ లెక్కల ప్రకారం 15 ఏళ్లు పైబడిన వాహనాలు రాష్ట్రం మొత్తంమీద 30 లక్షల వాహనాలు ఉండగా అందులో 21 లక్షల పైచిలుకు వాహనాలు గ్రేటర్ పరిధిలోనే ఉండడం విశేషం. ఈ 31 లక్షల వాహనాల్లో ప్రభుత్వ వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో ఆర్టీసి బస్సులు, ప్రభుత్వం వాడుతున్న కార్లు, ఆసుపత్రుల్లో వాడుతున్న అంబులెన్సులు సైతం ఉన్నాయి. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుకింద మార్చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చాలాకాలంగా చెబుతున్నా అది ఆచరణలోకి రాకపోవడంతో ఇన్ని రోజులుగా వాటి గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్క్రాప్ పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నామని తెలపడంతో ప్రస్తుతం 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి గణాంకాలపై అధికారులు దృష్టి సారించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం సూచనలతో…..
15 ఏళ్లు పైబడిన వాహనాల సంఖ్య పెరిగిపోతుండటం, వీటివల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందని వాతావరణ నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై సుప్రీంకోర్టు కూడా పాత వాహనాలను తుక్కుకింద మార్చేయాలని కేంద్రానికి, రాష్ట్రాలకు సూచించింది. 2025, జనవరి 1వ తేదీ నుంచి తుక్కు నిబంధనను కచ్చితంగా అమల్లోకి తీసుకురావాలని కేంద్రప్రభుత్వం అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా దానికి సంబంధించి విధి, విధానాలను ప్రకటించింది. 15 ఏళ్లు దాటిన వాహనాలను గుర్తిండంతో పాటు వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ల కేటాయింపు పారదర్శకం ఉండేలా రాష్ట్రంలో 37 ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో సెంటర్ ఏర్పాటు కోసం రూ.8 కోట్లు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.

రాయితీ ఇలా….
వాహనాలు కొని 15 ఏళ్లు పూర్తయినా, అంతకన్నా ఎక్కువ కాలం అయిన వాహనాలను యజమానులు స్వచ్ఛందంగా రవాణా శాఖకు అప్పగించాలి. ఒకవేళ అప్పగించకపోగా అధికారులు పట్టుకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 15 ఏళ్లు పైబడిన వాహనాన్ని అధికారులు తుక్కుగా మార్చి, ఆ వాహనాన్ని స్క్రాప్ చేసినట్టు రవాణా శాఖ అధికారులు యజమానికి సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. అనంతరం మనం కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు రవాణా శాఖ అధికారులు ఇచ్చిన రాయితీ సర్టిఫికెట్‌ను డీలర్‌కు ఇస్తే కొత్త వాహనంపై డీలర్ రాయితీని ఇస్తారు. ద్విచక్ర వాహనం లక్ష లోపు అయితే రూ.1,000లు రాయితీని డీలర్ మనకు ఇస్తారు. ఇక రూ.2లక్షల లోపు ద్విచక్ర వాహనం అయితే రూ.2,000లు, రూ.3లక్షల లోపు ద్విచక్ర వాహనం అయితే రూ.3 వేలు, 4 వీలర్ ధర రూ.5లక్షల లోపు అయితే రూ.10 వేలు రాయితీ మనకు వర్తిస్తుంది. ఇక 4 వీలర్ ధర రూ.5 నుంచి 10 లక్షల లోపు అయితే రూ.20 వేలు, రూ.10 నుంచి 15 లక్షల లోపు అయితే రూ.30 వేలు, రూ. 20 లక్షల లోపు, లేదా ఆపైన అయితే రూ.50 వేల రాయితీ మనకు వర్తిస్తుంది. ఇక ట్రాన్స్‌పోర్టు వాహనాలకు సంబంధించి 8 సంవత్సరాలలోపు ప్రతి సంవత్సరం త్రైమాసిక పన్నుపై 10 రాయితీ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

గ్రేటర్ పరిధిలో ద్విచక్రవాహనాలు 17 లక్షలు
15 ఏళ్లు పైబడిన 30 లక్షల వాహనాల్లో 20 లక్షలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. వాటిలో కూడా ద్విచక్రవాహనాలు 17 లక్షలు, కార్లు 3.5 లక్షలు, గూడ్స్ క్యారియర్లు లక్ష, ఆటో రిక్షాలు 20 వేలు ఉన్నాయని రవాణాశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించిన ప్రభుత్వ శాఖల్లోనూ సుమారు 10 వేల వాహనాలు, 2 వేల అంబులెన్సులున్నాయని, అలాగే ఆర్టీసి, విద్యా బస్సులకు చెందిన కాలంచెల్లిన బస్సులు, కార్లు సుమారు 3వేల దాకా ఉన్నట్లుగా సమాచాం. 15 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చే బాధ్యతలను చేపట్టడానికి ప్రముఖ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలిసింది. తుక్కుగా మార్చడానికి ముందుకు వచ్చే కంపెనీలు టెండర్‌ల ద్వారా ఆయా కంపెనీలకు అవకాశం ఇవ్వాలని రవాణాశాఖ నిర్ణయించినట్టుగా సమాచారం. దీంతోపాటు రవాణాశాఖకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి తుక్కుగా మార్చే ప్రక్రియకు ఆసక్తి ఉన్న కంపెనీలు లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com