Sunday, November 10, 2024

రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు

  • ఒకవేళ వచ్చినా అవి కాంగ్రెస్ ఖాతాలోనే…
  • అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ బలోపేతం చేస్తా
  • వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేలా పనిచేస్తా
  • కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతా
  • వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ కమిటీలను ఏర్పాటు చేస్తా
  • మరికొంత మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు
  • ఢిల్లీలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణలో ఉపఎన్నికలు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆ విషయమై స్పందించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ వచ్చినా అవి కాంగ్రెస్ ఖాతాలోనే చేరుతాయని ఆయన తేల్చిచెప్పారు. గురువారం ఢిల్లీలో ఏఐసిసి చీఫ్ ఖర్గేను మహేష్ కుమార్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 60 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న మహానాయకుడు ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారని, ఖర్గేను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ బలోపేతానికి పనిచేయాలని ఖర్గే తనకు సూచించారన్నారు. కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన స్థానాలకంటే ఎక్కువ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయబోతున్నామన్నారు. అట్టడుగు కార్యకర్త నుంచి అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేలా పనిచేస్తామని ఆయన తెలిపారు.

మంత్రివర్గ విస్తరణలో సిఎం, ఏఐసిసి పెద్దలదే నిర్ణయం
మంత్రివర్గ విస్తరణ గురించి సిఎం, ఏఐసిసి పెద్దలు మాట్లాడారని వారే నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకు పాత కమిటీలు పనిచేస్తాయని ఆయన తెలిపారు. బాధ్యతలు చేపట్టాక కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతానని ఆయన అన్నారు. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ కమిటీలను ఏర్పాటు చేస్తామని, పార్టీ సమన్వయంతో ముందుకు సాగాల్సి ఉంటుందని మహేశ్ తెలిపారు. ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇచ్చారని, తాము సమన్వయంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. కమిటీల్లో అన్ని సామాజికవర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందన్నారు.

పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సమయం ఇచ్చిందని మరికొంత మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ ఫిరాయించిన అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే, ప్రత్యామ్నాయాలు చూస్తామని, రాజ్యాంగబద్ధంగా పార్టీ మార్పులపై నడచుకుంటామని ఆయన తెలిపారు. మా పార్టీ విధానాలు, పాలన చూసి కొందరు నేతలు వస్తే చేర్చుకున్నామని, ప్రతిపక్ష పాత్ర నిర్వహించే స్థితిలో తమ పార్టీ నేతలు లేరని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్‌ఎస్‌కు సున్నా స్థానాలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కెటిఆర్, కెటిఆర్‌లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అలాగే అరికపూడి గాంధీ సాంకేతికంగా బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అని సాంకేతికంగా ఆయనకు పీఏసీ చైర్మన్ ఇచ్చామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular