Wednesday, December 25, 2024

అరుపులు, కేకలు, ఘాటైన విమర్శలు

శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న ఆరవరోజు కూడా అదే ధోరణి. అధికార, విపక్షాల మధ్య ఘాటైన విమర్శలు, పరుష పదజాలాలు. ఫలితంగా సభను పలుసార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి. వాస్తవంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ నుండి ఇదే ధోరణి కొనసాగుతున్నది. కాని, శుక్రవారం ఆరవరోజు అది పరాకాష్టకు చేరుకుంది. సభ ప్రారంభంలో చర్చలను సామరస్యంగా కొనసాగనివ్వాలన్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ విజ్ఞప్తిని ప్రధాన విపక్షం బిఆర్‌ఎస్‌ ఏమాత్రం పట్టించుకున్నట్లులేదు. సభ ఆరంభం నుండి బిఆర్‌ఎస్‌ ఒకే డిమాండ్‌ను వ్యక్తంచేస్తూ మొండిగా పట్టుపట్టడంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడిరది. దీనికంతటికీ బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే  కల్వకుంట్ల తారక రామారావుపైన కేసు నమోదు కావడమే కారణమైంది.

ఫార్ములా- ఈ కార్‌ రేస్‌కు సంబంధించి  కెటిఆర్‌పైన ఏసిబి కేసు నమోదు అయింది. ఇందులో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రధాన అభియోగం. హెచ్‌ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతులు లేకుండా విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగా యన్నది ఆరోపణ. ఈ విషయంపైన రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఏసిబి నాలుగు సెక్షన్‌లతో కేసు నమోదు చేయడంతో కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలమధ్య మాట లయుద్దానికి దారితీసింది. ఇందులో మరో ఆసక్తికర విషయమేమంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ (ఇడి) కూడా రంగంలోకి దిగటంతో ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిరది. ఈ కేసుకు సంబంధించిన  ఎఫ్‌ఐఆర్‌ కాపీతోపాటు, హెచ్‌ఎండిఏ అకౌంట్‌ నుంచి నగదు బదిలీ తదితర వివరాలను ఇవ్వాల్సిందిగా ఏసిబిని ఇడి కోరడం బిఆర్‌ఎస్‌ వర్గాల్లో ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ కేసులో తమ నాయకుడు కెటిఆర్‌ను ఏ-1గా ప్రకటించడంతో పాటు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌లను చేర్చడం బిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో అయోమయం నెలకొంది.

అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లు ఈ కేసులో ఎలాంటి అవకతవకలు జరుగలేదని, అందుకు సంబందించిన అన్ని వివరాలను చెప్పే అవకాశం తనకివ్వాలని కెటిఆర్‌ చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. తనపై వొచ్చిన ఆరోపణలను నాలుగు గోడల మధ్య విచారించడం సరైందికాదని, ప్రజలందరికీ తెలిసేవిధంగా అసెంబ్లీలో వివరణ ఇచ్చుకునే అవకాశం తనకివ్వాలంటూ స్పీకర్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి లిఖితపూర్వకంగా కెటిఆర్‌ విజ్ఞప్తిచేశారు. అదే అంశాన్ని శుక్రవారం సభలో ఆపార్టీ మరోసీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్యే  హరీష్‌రావు లేవనెత్తడం గందరగోళానికి దారితీసింది. ఇదే శాసనసభలో సభ్యుడైన తమ నాయకుడి పైన వొచ్చిన ఆరోపణపై సంబంధిత సభ్యుడు వివరణ ఇచ్చుకునే అవకాశమివ్వాలని హరీష్‌రావు పట్టుపట్టడమే ఆరవరోజు ఆరంభంనుండి సభ ఆర్డర్‌లో లేకుండాపోయింది. ఇదే విషయం పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ తన పై కేసు నమోదు కావడం పై కేటీఆర్‌ న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం ..కేసు ఏసీబీ పరిధిలో ఉండగా సభలో చర్చకు ఆస్కారం ఉండదని వివరించారు.

షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారంనాటి సభలో ‘భూ భారతి’పైన చర్చ జరుగాల్సి ఉంది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి పైన చర్చ ప్రారంభించడాన్ని అడ్డుకుంటూ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  ఫార్ములా- ఈ కార్‌ రేస్‌పైన చర్చించాలని పట్టుపట్టడం, దానికి కాంగ్రెస్‌ సభ్యులనుండి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో అరుపులు, కేకలతో సభ మారుమోగింది. బిఆర్‌ఎస్‌ శాసనసభ్యులు స్పీకర్‌ వెల్‌లోకి తోసుకురావడం, మార్షల్స్‌ అడ్డుకోవడం, కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  కాగితాలను చించి విసురుకోవడం ఒక విధంగా యుద్ధ వాతావరణాన్ని తలపించింది..

శీతాకాల సభల ప్రారంభం నుండి అధికార, ప్రతిపక్షాలమధ్య వాగ్వాదాలు తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి. మోదీ- ఆదానీని తీసుకుని అధికార కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ వర్గాలు పరస్పరం విమర్శించుకోవడం దగ్గరి నుంచి పంచాయితీలకు సంబంధించిన  పెండిరగ్‌ బిల్లుల విషయంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక లగచర్ల విషయంలోనూ అదే విమర్శలు. రాష్ట్రంలో అంతపెద్ద ఘటన జరిగితే దాన్ని శాసనసభలో చర్చించకపోవడంపట్ల బిఆర్‌ఎస్‌ అధికారపార్టీ పైన తీవ్రాతితీవ్రంగా ఆరోపిస్తున్నది. లగచర్ల సంఘటన పై చర్చించకుండా ప్రభుత్వం తప్పించుకుంటున్నదని,  దాని చర్చించమంటే పర్యాటకంపైన చర్చను ముందుకు తెచ్చిందన్నది బిఆర్‌ఎస్‌ ఆరోపణ. మొత్తం మీద గత ఆరు రోజులుగా సభలో జరుగుతున్న వాగ్వాదాలతో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com