Friday, November 29, 2024

నేనెక్కడికీ పారిపోలేదు నా డెన్‌లోనే ఉన్నా

  • నా వెనుక ఏదో కుట్ర?.. అందుకే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు…
  • ఇప్పటి వరకు పోలీసులు తన డెన్‌లో కాలు పెట్టలేదన్న రాంగోపాల్ వర్మ
  • నాలుగైదు రోజుల్లోనే నాపై 9 కేసులు నమోదు
  • పోలీసులు వెతుకుతున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు: రామ్‌గోపాల్‌వర్మ

తన మీద ఒకేసారి వివిధ జిల్లాల్లో కేసులు నమోదవడం చూస్తుంటే కుట్ర జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అనుమానం వ్యక్తం చేశారు. తనపై కుట్ర జరుగుతుందనిపించడం వల్లే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన 22 పాయింట్లతో ఎక్స్ వేదికగా సుదీర్ఘ ట్వీట్ చేశారు. తాను ఎవరినీ నిందించడం లేదు కానీ నా వెనుక ఏదో జరుగుతోందని మాత్రం అర్థమవుతోందన్నారు.

నా కేసు-ఆర్జీవీ అంటూ చేసిన ఈ ట్వీట్‌లో తనపై నమోదైన కేసులు, సెక్షన్లను వివరిస్తూ అది తనకు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. అలాగే ప్రచారం జరుగుతున్నట్లుగా తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. నా డెన్‌లోనే ఉన్నానని తెలిపారు. పోలీసులు కూడా తనను అరెస్ట్ చేయడానికి రాలేదని వెల్లడించారు. అర్జీవీ చేసిన వరుస ట్వీట్‌లు చేశారు. ‘నేనేదో పరారీలో ఉన్నాను, మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైమ్ అంతా నేను నా డెన్ ఆఫీసులోనే ఉన్నాను.

అప్పుడప్పుడు నా సినిమా పనుల కోసం బయటకు వెళ్లాను’ అని ట్వీట్ చేశారు. ‘పోలీసులు ఇప్పటి వరకు నా ఆఫీసులోకి కాలు కూడా పెట్టలేదు. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు?’ అని ట్వీట్‌లో ప్రశ్నించారు. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే నలుగురు వేర్వేరు వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు వేర్వేరు జిల్లాల్లో నా మీద ఈ కేసు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు. ఇవన్నీ కూడా కేవలం గత 4, 5 రోజుల్లోనే నమోదయ్యాయ’ని మరో ట్వీట్‌లో వివరించారు. ‘నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాను. చాలాసార్లు రోజుకి 10 నుంచి 15 పోస్టులు కూడా చేసేవాడిని. ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టానంటున్న పోస్టులు నేను చేసిన ఒక రాజకీయ వ్యంగ్య చిత్రంకు సంబంధిం చినవి. ఆ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడం ఆ చిత్రం విడుదల అవ్వడం కూడ చాలా నెలల క్రితం జరిగిపోయింద’ని వెల్లడించారు. ‘నేను పెట్టిన ఏ పోస్టుల వల్ల వేర్వేరు ప్రాంతాల్లో మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నార’న్నారు.

‘నా సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయబడిందని చెప్పబడుతున్న విషయం, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)a ప్రకారం న్యాయబద్ధమైనది. దీని ప్రకారం ప్రతి వ్యక్తి తన అభిప్రాయాలను, ఆలోచనలను స్వేచ్ఛగా తెలియజేయవచ్చు. ఇది కేవలం మాటల ద్వారా మాత్రమే కాదు.. రాతల ద్వారా… చిత్రాల ద్వారా… సినిమాల ద్వారా… పోస్టర్ల ద్వారా కూడా అవ్వచ్చు’ అని అన్నారు. ‘మనం ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో బతుకుతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే సినిమా మనుషులు, రాజకీయ నాయకులు, సాధారణ జనం అందరూ ప్రతి రోజు ఈ సోషల్ మీడియాలో తమ ఉద్దేశాలను రుద్దుతూ, జోక్స్ వేసుకుంటూ, అరుచుకుంటూ, బూతులు తిట్టుకుంటూ, బోధనలు చేస్తుంటారు.

ఇప్పుడు వీటన్నింటినీ సీరియస్‌గా తీసుకుంటే దేశంలో సగంమంది పైన కేసు పెట్టాల’ని అన్నారు. ‘ప్రస్తుతం నా కేసు గురించి మాట్లాడితే, నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను పోలీసుల విచారణకు హాజరు కావటానికి ఇంకొంత సమయం కావాలని లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనటానికి అనుమతి కావాలని విజ్ఞప్తి చేస్తూ లెటర్ పంపిన 30 నిమిషాలలో పోలీసులు నా ఆఫీసుకు వచ్చారు. కానీ వాళ్ళు నా ఆఫీసు లోపలకి రాలేదు. నన్ను అరెస్టు చేయటానికి వచ్చామని కూడా చెప్పలేద’ని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘ఇప్పటికీ మీడియాలో వస్తున్న కథనాలు నన్ను పట్టుకోవటానికి పోలీసులు టీమ్స్ ఏర్పరిచారని వాళ్ళు ముంబై, చెన్నై ఇంకా పలుచోట్ల వెతుకుతున్నారని నేను పరారీలో ఉన్నానని.

కానీ ఇవన్నీ అబద్ధాలు. ఈ మీడియా ప్రతిసారి లాగే హైడ్రామా క్రియేట్ చేసింద’ని పేర్కొన్నారు. ‘లెక్కలేనన్ని మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ రావడం వల్ల నేను నా మొబైల్ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాను. ఎందుకంటే ఇవన్నీ నా పనిని డిస్టర్బ్ చేస్తాయి. ఇప్పటి వరకు నేను రిక్వెస్ట్ చేసిన అడిషనల్ టైమ్‌కి నాకు ఆఫీసర్ల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. నా మీద ఒకేసారి వివిధ జిల్లాలో కేసులు నమోదవటం అనేది ఏదో కుట్ర జరుగుతుందనిపించింది. అందుకే నేను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశాను. కానీ నేను వాస్తవాలు తెలియకుండా ఒక వ్యక్తిని లేక ఒక గ్రూప్‌ని నిందించటం లేదు, కానీ వెనుక ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతోంద’ని వెల్లడించారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. అలాగే ప్రభుత్వ సంస్థల నియమ నిబంధనలును కచ్చితంగా పాటిస్తాను. కాని దాంతో పాటు రాజ్యాంగ పరిధిలో చట్టం కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకునే ప్రాథమిక హక్కును వినియోగించుకుంటాను. ఎప్పటి లాగే మీడియా సొంతంగా ఒక కథ రాసుకుని అందులో నన్ను సెంట్రల్ కేరక్టర్‌గా చేసి ఒక సినిమా తీసింది. నాకు కూడా వాళ్ళకున్నంత టాలెంట్ ఉండి ఉంటే ఎంత బాగుండేదో?’ అని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular